Share News

Revanth Govt: రుణమాఫీపై త్వరలో తీపికబురు

ABN , Publish Date - Feb 24 , 2024 | 03:07 AM

రైతులకు త్వరలో తీపి కబురు చెప్పబోతున్నామని, వారికిచ్చిన హామీ అమల్లో భాగంగా రూ.2 లక్షల రుణ మాఫీపై బ్యాంకర్లతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

Revanth Govt: రుణమాఫీపై త్వరలో తీపికబురు

  • బ్యాంకర్లతో తుది దశకు చేరిన చర్చలు.. 27న ఫ్రీ విద్యుత్తు, సిలిండర్‌ పథకాలకు శ్రీకారం

  • ప్రియాంక చేతుల మీదుగా ప్రారంభిస్తాం.. 2న మరో 6000 కొలువులకు నోటిఫికేషన్‌

  • లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏడుచోట్ల, బీఆర్‌ఎస్‌ పదిచోట్ల పోటీకి ఒప్పందం!

  • కుంభమేళాకు రూ.కోట్లు ఖర్చు చేయట్లేదా!?.. మేడారానికి జాతీయ హోదా ఇస్తే తప్పేంటి?

  • కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.. మేడారంలో ‘శాశ్వత అభివృద్ధి’కి కమిటీ

  • జాతరకు మోదీ, షా రావాలి: సీఎం.. వనదేవతలను దర్శించుకుని మొక్కుల సమర్పణ

  • గిరిజనుల అభ్యున్నతికి కృషి.. ఆదివాసీలను ప్రధాన స్రవంతిలోకి తెస్తా: తమిళిసై

  • మేడారంలో భక్తులకు అనారోగ్య సమస్యలు.. 4 రోజుల్లో 1.5 లక్షల మందికి మందులు

  • మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులకు మంత్రులతో కమిటీ

  • జాతరకు ప్రధాని మోదీ,అమిత్‌ షా రావాలి: సీఎం రేవంత్‌

వరంగల్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రైతులకు త్వరలో తీపి కబురు చెప్పబోతున్నామని, వారికిచ్చిన హామీ అమల్లో భాగంగా రూ.2 లక్షల రుణ మాఫీపై (Rythu Runamafi) బ్యాంకర్లతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. త్వరలోనే రైతులకు రుణమాఫీ ప్రకటన చేస్తామని తెలిపారు. తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని, ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తున్నామని, 27వ తేదీ నుంచి మరో రెండింటిని ప్రారంభిస్తామని తెలిపారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు శుక్రవారం వచ్చిన ఆయన తల్లులను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని (66 కిలోల బెల్లం) తులాభారం వేయించి గద్దెల వద్ద అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. ‘‘రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌తోపాటు తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే పథకాలను 27వ తేదీ నుంచి అమలు చేస్తాం. కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం’’ అని తెలిపారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆదరణ పొందిందని, మేడారం జాతరకు 6 వేల బస్సులు నడిపి వాటిలోనూ మహిళలను ఉచితంగా జాతరకు తరలించామని చెప్పారు. జాతరను దృష్టిలో ఉంచుకొని కొత్తగా 100 బస్సులను కొనుగోలు చేసి నడుపుతున్నామని తెలిపారు.

మార్చి 2న మరో 6000 కొలువులు

తాము అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, వీటిలో 6,956 స్టాఫ్‌ నర్సు; సింగరేణిలో 441; 10 వేలకుపైగా పోలీస్‌, ఎక్సైజ్‌, ఫైర్‌ శాఖలో కొలువులు కల్పించామని సీఎం రేవంత్‌ తెలిపారు. మార్చి 2న మరో 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. ఇటీవల 25 వేల ఉద్యోగాల భర్తీని చూసి కుళ్లుకుంటున్నవారు చూసేలా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించామన్నారు. మామ, అల్లుడు, బావ, బామ్మర్దులు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ బదిలీల్లో పారదర్శకత పాటిస్తున్నామని, గతంలో జీతం ఎప్పు డు వస్తుందోనని ఉద్యోగులు ఎదురు చూసేవారని, ప్రస్తుతం ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నామని అన్నారు. ఒక గంట కూడా సెలవు తీసుకోకుండా తన మంత్రివర్గ సహచరులు పని చేస్తున్నారని తెలిపారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు రాష్ట్రంలో పది స్కిల్‌ యూనివర్సిటీలను ప్రారంభించారని, అనేక మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందం

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందానికి తెగబడుతున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ‘‘బయటకు విమర్శలు చేసుకుంటున్నా.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏడుచోట్ల బీజేపీ, పది స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేసేలా చీకటి ఒప్పందం కుదిరింది. బీఆర్‌ఎస్‌, బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి’’ అని పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశించామని, బీజేపీ నేతలు మాత్రం సీబీఐకి అప్పగించాలని కోరుతున్నారని, సీబీఐకి అప్పగిస్తే కేసులతో బెదిరించి కేసీఆర్‌ను గిల్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ అవినీతిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని, సీబీఐ, ఈడీ, ఐటీ వాళ్ల చేతుల్లోనే ఉన్నా ఎటువంటి విచారణ జరపలేదని గుర్తు చేశారు. అందుకే, హైకోర్టు లేదా సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారణ చేయించాలని భావిస్తున్నామన్నారు. ‘‘కుంగిన మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి అన్నారం బ్యారేజీలో పోయాలని హరీశ్‌ రావు అంటున్నారు. దూలంలా పెరిగినా దూడకు ఉన్న బుద్ధి కూడా ఆయనకు లేదు. అన్నా రం బ్యారేజీలో లీకేజీలు అవుతున్నాయనే కిందికి వదులుతున్నాం. కిందికి వదిలిన నీటిని పైకి ఎత్తిపోయాలని ఎలా అంటున్నారు!?’’ అని మండిపడ్డారు.

కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేమం టూ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కుంభమేళాకు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న కేంద్రం.. గిరిజన జాతరకు జాతీ య హోదా ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. మేడారానికి కేంద్రం మొండి చేయి చూపిందని పత్రికల్లో వార్తలు వస్తే.. రూ.3 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. అయోధ్యలో రామాలయాన్ని ఎలా దర్శించుకుంటామో సమ్మక్క-సారలమ్మలను కూడా అలాగే దర్శించుకునేందుకు మోదీ, షా రావాలని, వారి కోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం మేడారంపై నిర్లక్ష్యం చేసి మూల్యం చెల్లించుకుందని, బీజేపీకి కూడా అలాంటి పరిస్థితే వస్తుందని హెచ్చరించారు.జాతరలో తాత్కాలిక పనులతో కోట్ల రూపాయలు వృథా అవుతున్నాయని పత్రికల్లో వార్తలు వచ్చాయని, శాశ్వత పనుల కోసం త్వరలోనే మంత్రులతో కమిటీ వేస్తామని చెప్పారు. మంత్రులు సీతక్క, సురేఖ, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితో కమిటీ వేసి ఆదివాసీలు, భక్తుల నుంచి సలహాలు తీసుకుంటామన్నారు.

75 రోజుల్లో ప్రజల్లో విశ్వాసం కల్పించాం

సమస్యలు చెబితే తీరుతాయనే నమ్మకాన్ని ఈ 75 రోజుల తమ హయాంలో కల్పించామని సీఎం రేవంత్‌ తెలిపారు. సరిగ్గా ఏడాది కిందట ప్రతిపక్ష నేతగా అమ్మవార్లను దర్శించుకొని మొక్కుకున్నానని, రాష్ట్ర ప్రజల అభీష్టాన్ని ఆ తల్లి మన్నించినందుకు మొక్కు తీర్చుకున్నానని తెలిపారు. వన దేవతల ఆశీస్సులతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. సీఎం వెంట జాతరకు వచ్చిన సీఎస్‌ శాంతి కుమారి కూడా అమ్మవార్లకు మొక్కులు సమర్పించారు.

గృహజ్యోతి, సిలిండర్‌ పథకాలకు చేవెళ్ల నుంచే శ్రీకారం

కాంగ్రెస్‌ పార్టీ తనకు సెంటిమెంట్‌గా మారిన చేవెళ్ల నుంచే ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ఈనెల 27న సీఎం రేవంత్‌ రెడ్డి, ప్రియాంకగాంధీ పథకాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు నిర్వహిస్తున్న సభ కావడంతో పెద్దఎత్తున మహిళా సంఘాలను తరలించనున్నారు. సభ ఏర్పాట్ల పరిశీలనకు శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ శశాంక్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి తదితరులు పరిశీలించారు. ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Feb 24 , 2024 | 07:45 AM