సోలో బతుకే.. సో బెటర్!
ABN , Publish Date - Oct 22 , 2024 | 03:15 AM
సోల్ బతుకే సో బెటర్... దక్షిణ కొరియాలో ప్రస్తుతం ఈ ట్రెండే నడుస్తోంది. పెళ్లి చేసుకోవడం ఆనందమేనని చాలామంది అంటున్నా... దాని జోలికి వెళ్లేందుకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు.
దక్షిణ కొరియాలో వివాహాలపై విముఖత.. యువకుల సగటు వివాహ వయసు 34పైనే
అమ్మాయిల ఆలోచనలు కూడా అదే తీరులోనే
ఇక్కడ జననాల రేటు అత్యల్పంగా 0.72శాతం
ట్రాఫిక్ షరా మూమూలే.. శుభ్రంగా రహదారులు
స్ట్రీట్ ఫుడ్‌కు ఆదరణ.. సాయంత్రం వేళల్లో జోష్
(సియోల్ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి): సోల్ బతుకే సో బెటర్... దక్షిణ కొరియాలో ప్రస్తుతం ఈ ట్రెండే నడుస్తోంది. పెళ్లి చేసుకోవడం ఆనందమేనని చాలామంది అంటున్నా... దాని జోలికి వెళ్లేందుకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. చూద్దాంలే అంటూనే 30 ఏళ్లు దాటించేస్తున్నారు. దక్షిణ కొరియన్ అబ్బాయిల సగటు వివాహ వయసు 34పైనే. కొందరు 35-40ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోవడం లేదు. అలాగని అక్కడ అమ్మాయిలు దొరక్క కాదు. అమ్మాయిని వెదికే కష్టాలు ఇక్కడా ఉన్నా... దానికంటే పెద్ద కారణం అసలు వివాహం మీద మనసు పడకపోవడమే. అబ్బాయిలే కాదు... అమ్మాయిలదీ ఇదే పరిస్థితి. వారి సగటు వివాహ వయస్సు 31.5 ఏళ్లుగా ఉంది. ఉన్నత చదువులు, జీవితంలో స్థిరత్వంపైనే దృష్టి పెడుతూ వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నారు. అంతేకాదు...చాలా మంది పెళ్లిళ్లు చేసుకోబోమని తెగేసి చెబుతున్నారు.
ఒక ఇల్లు కొనడం, కుటుంబాన్ని పోషించడం, పిల్లల్ని చదివించడం వంటి బాధ్యతల్ని స్వీకరించేందుకు సిద్ధంగా లేమని అక్కడి ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 60శాతం యువకులుప్పారు. పిల్లల్ని కనడం, ఇంటి పనులు చేయడం.. తమకు ఏ మాత్రం ఇష్టం లేదని అదే సర్వేలో అత్యధిక శాతం యువతులు అభిప్రాయపడ్డారు. దక్షిణకొరియాలో మరో సమస్య ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయడం. రాజధాని సోల్(సియోల్)లో మధ్య తరగతి ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో ఒక డబుల్ బెడ్ రూం ఫ్లాట్ కొనాలంటే దాదాపు రూ.కోటి వెచ్చించాల్సిందే. ఇక, గంగమ్, చియాన్యాచిన్ వంటి ప్రాంతాలోనైతే అదనంగా మరో రూ.50 లక్షలు సమర్పించుకోవాల్సిందే. సగటు కొరియన్‌కు ఇది కష్ట సాధ్యంగా మారింది. ‘‘పెళ్లి చేసుకుంటే అపార్ట్మెంట్ కొనాలి.
అది ఖరీదైన వ్యవహారం. పిల్లల పెంపకం అన్నీ చూసుకోవాలి. అందుకే దానిపై దృష్టిపెట్టలేదు. అలాగని పెళ్లి చేసుకోం అనికాదు. నా స్నేహితులు కొందరు చేసుకున్నారు. సంతోషంగా కూడా ఉన్నారు. కానీ నేను మాత్రం చేసుకోదలచుకోలేదు’’ అని 38 ఏళ్ల టీక్ కిమ్ పేర్కొన్నారు. దక్షిణ కొరియా ధనిక దేశమే కదా! ఆర్థిక కారణాలతో పెళ్లికెందుకు భయపడుతున్నారని లీ మిన్ అనే అబ్బాయిని ప్రశ్నించగా...‘‘కొరియా ధనిక దేశమే. కానీ కొరియన్లందరూ ధనికులు కాదు’’అని సమాధానమిచ్చారు. ఈ పరిస్థితితో కొరియాలో జననాల రేటు దారుణంగా 0.72శాతానికి పడిపోయింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ జననాల రేటు ఉన్న దేశాల్లో తొలి మూడు స్థానాల్లో కొరియా ఒకటి కావడం గమనార్హం. ప్రపంచ సగటు జననాల రేటు 2.3శాతం ఉండగా...అందులో నాలుగింట ఒక వంతు కూడా ఈ దేశంలో లేకపోవడం గమనార్హం.
కిమ్‌లా కాదు... వీళ్లు స్లిమ్
పెళ్లికి దూరంగా ఉంటున్న కొరియన్లు ఫిట్నె్సలో మాత్రం బ్రహ్మాండం. వేల మందిని చూసినా.. ఎవరికీ కొంచెం పొట్ట కూడా కనిపించ లేదు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌లా కాకుండా... దక్షిణ కొరియన్లు యమ స్లిమ్. నాణ్యమైన సౌందర్య ఉత్పత్తుల త యారీలో దక్షిణ కొరియా నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇక్కడి సౌందర్య ఉత్పత్తుల్ని ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేస్తుంటారు. సియోల్‌లో రోడ్లు అత్యంత శుభ్రంగా ఉన్నాయి. నాలుగు లేన్ల రహదారి అయినా... మన సుల్తాన్‌బజార్ లాంటి చిన్న గల్లీలైనా స్వచ్ఛంగా, అందంగా ఉన్నాయి. సాయంత్రాలు వీధుల్లోకి వచ్చి స్ర్టీట్ ఫుడ్ తినడానికి కొరియన్లు బాగా ఇష్టపడతారు. కొన్నిచోట్ల హోటళ్లలో కంటే స్ర్టీట్ ఫుడ్ ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఈ వీధి దుకాణాలు కూడా చాలా శుచి, శుభ్రతతో ఉంటాయి. ఇక్కడ వెజ్‌కు, నాన్‌వెజ్‌కు ధరలో వ్యత్యాసం ఉండదు. ఇంకా ఆశ్చర్యక రమైన అంశం... నాన్‌వెజ్ ఆహారం వెజ్ కంటే తక్కువ ధరకే దొరుకుతుంది. కొరియన్ కరెన్సీ వాన్ కు మన రూపాయితో పోలిస్తే విలువ తక్కువ. మన రూపాయి 16.40వాన్లకు సమానం. అంటే ఎవరైనా భారత్‌లో ఒక ఐఫోన్‌ను రూ.1.5లక్షలు పెట్టి కొనుగోలు చేస్తే... ఇక్కడ అదే ఫోన్‌కు సుమారు 25లక్షల వాన్లు పెట్టాలన్న మాట.