Share News

Sridhar Babu: జీవో 317 బాధిత ఉపాధ్యాయులకు దసరా లోపు తీపి కబురు

ABN , Publish Date - Oct 06 , 2024 | 03:12 AM

జీవో 317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులు ఆందోళనపడవద్దని, దసరా లోపు వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతుందని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు.

Sridhar Babu: జీవో 317 బాధిత ఉపాధ్యాయులకు దసరా లోపు తీపి కబురు

  • రాష్ట్రంలో నూతన విద్యావిధానాన్ని తెస్తాం

  • టీచర్లు తమ సూచనలివ్వాలి: మంత్రి శ్రీధర్‌బాబు

చేవెళ్ల, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): జీవో 317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులు ఆందోళనపడవద్దని, దసరా లోపు వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతుందని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో కొత్త విద్యావిధానాన్ని తీసుకువచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారని, ఉపాధ్యాయులు తమ సలహాలు, సూచనలను కమిటీకి ఇవ్వాలని కోరారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని పద్మావతి కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్యక్షతన.. చేవెళ్ల నియోజకవర్గంలోని 5 మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరినీ సన్మానించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయులందరికీ పదోన్నతులతో పాటు బదిలీలు కూడా చేసినట్లు తెలిపారు. ఈ నెల 9న కొత్తగా మరికొందరు ఉపాధ్యాయు లు రాబోతున్నారని చెప్పారు. ఉపాధ్యాయులకు జూలై నెల వేతనాలు, ఇంటి స్థలాల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు మరింత కష్టపడాలని కోరారు. అంతకుముందు ప్రభుత్వ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాల్సిన పూర్తి బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

Updated Date - Oct 06 , 2024 | 03:12 AM