Suspension: ఏఆర్ ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్ సహా విధుల నుంచి 10 మంది తొలగింపు!
ABN , Publish Date - Oct 28 , 2024 | 04:29 AM
సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డెక్కిన పోలీసు సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.
ఉద్యోగాల నుంచి తప్పించిన టీజీఎస్పీ
నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలతోనే..
ఆర్టికల్ 311 ప్రకారం తొలగించినట్లు వెల్లడి
సిబ్బంది నిరసనలపై కొనసాగుతున్న విచారణ
త్వరలో మరికొందరిపైనా చర్యలు?
హైదరాబాద్/సిటీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డెక్కిన పోలీసు సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. నిరసనల పేరుతో నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ 39 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను శనివారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఓ ఏఆర్ ఎస్సై, మరో హెడ్ కానిస్టేబుల్ సహా ఏకంగా 10 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణగా ఉండాల్సిన పోలీసు శాఖలో నిబంధనలకు విరుద్ధంగా నిరసనలు తెలిపారన్న కారణంతో వీరిని తొలగిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ)లో సెలవులతోపాటు ఇతర అంశాలకు సంబంధించి అదనపు డీజీపీ ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని బెటాలియన్ల సిబ్బంది, కుటుంబ సభ్యులు నిరసనలకు దిగారు. ఆర్డర్లీ వ్యవస్థ, సెలవులు ఇవ్వకపోవడం, ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కొందరు పరిధి దాటి వ్యవహరించినట్లు పోలీసు శాఖ అంతర్గత విచారణలో తేల్చారు. దీంతో ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇబ్రహీంపట్నంలోని 3వ బెటాలియన్‌లో కానిస్టేబుల్ జి.రవికుమార్; భద్రాద్రి కొత్తగూడంలోని ఆరో బెటాలియన్‌లో కానిస్టేబుల్ కె.భూషణ్‌రావు; అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్ వి.రామకృష్ణ, కానిస్టేబుల్ ఎస్.కె.షఫీ; సిరిసిల్లలోని 17వ బెటాలియన్‌లో ఏఆర్ ఎస్సై సాయిరామ్; కానిస్టేబుళ్లు కె.లక్ష్మీనారాయణ, ఎస్.కరుణాకర్‌రెడ్డి, టి.వంశీ, బి.అశోక్, ఆర్.శ్రీనివా్‌సలను విధుల నుంచి తప్పించారు. వీరందరిపై ఆర్టికల్ 311(2)(బి) ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. నిరసనల పేరుతో బెటాలియన్లలో చోటుచేసుకున్న పరిణామాలపై విచారణ కొనసాగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నిరసనలు తెలిపిన మరికొందరిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. బెటాలియన్ సిబ్బంది తమ సమస్యలను దర్బార్లలో అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నతాధికారులు సూచించారు.