Supreme Court: గ్రూప్-1 వాయిదాకు సుప్రీం నిరాకరణ..
ABN , Publish Date - Oct 22 , 2024 | 03:29 AM
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల వాయిదా, జీవో రద్దుపిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఫలితాల వెల్లడికి ముందే విచారణను ముగించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది.
పరీక్షల వాయిదా, జీవో 29 రద్దు పిటిషన్‌పై జోక్యం చేసుకోం
అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద ఉండగా స్టే ఇవ్వలేం
పిటిషనర్లకు తేల్చిచెప్పిన సర్వోన్నత న్యాయస్థానం
ఫలితాలకు ముందే విచారణ పూర్తికి హైకోర్టుకు ఆదేశం
న్యూఢిల్లీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల వాయిదా, జీవో రద్దుపిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఫలితాల వెల్లడికి ముందే విచారణను ముగించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. తమ తుది తీర్పునకు లోబడే నియామకాలు జరపాల్సి ఉంటుందంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టంగా వెల్లడించిన విషయాన్ని సుప్రీం ధర్మాసనం గుర్తుచేసింది. తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనే అభ్యర్థి గత శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పరీక్షల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించట్లేదని, ప్రభుత్వం తెచ్చిన జీవో వల్ల తాము నష్టపోతున్నామని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతోపాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌ను విచారించింది. ఇప్పటికే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారని, ఇలాంటి సమయంలో స్టే ఎలా ఇస్తామని ప్రశ్నించింది. ఇప్పుడు స్టే ఇవ్వడం అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తుందని వ్యాఖ్యానించింది. కాగా.. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు పూర్తి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జోవో 29ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ‘‘పద్నాలుగేళ్ల తర్వాత.. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా.. రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్ష జరుగుతోంది.
అభ్యర్థులు సుధీర్ఘకాలంగా ఈ ఉద్యోగంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే.. ఇప్పట్లో మళ్లీ గ్రూప్-1 భర్తీ జరగదు. అభ్యర్థులు ఈ సువర్ణావకాశాన్ని కోల్పోతే వారికి తీరని నష్టం జరిగినట్టే. కాబట్టి జీవో 29పై స్పష్టత వచ్చే వరకూ పరీక్షలు నిర్వహించొద్దు. వాయిదా వేయాలి’’ అని ధర్మాసనాన్ని కోరారు. దీనికి సీజేఐ.. ‘‘స్వయంప్రతిపత్తి కలిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పరీక్షలు వాయిదా వేయాలని ఎలా ఆదేశించగలం?’’ అని ప్రశ్నించారు. ఇది అసాధారణమైన విషయమని వ్యాఖ్యానించారు. సిబల్ మాత్రం.. ఇది వేలాది మంది జీవితాలకు సంబంధించిన విషయమంటూ పరీక్ష వాయిదాకు పట్టుబట్టారు. ఎస్సీ, ఎస్టీ వర్సెస్ భూపేంద్ర యాదవ్ కేసులోని తీర్పు వివరాలను ధర్మాసనానికి అందించారు. అయినప్పటికీ.. ధర్మాసనం ఆయన వాదనలతో ఏకీభవించలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఎలా ఆపగలమని మరోసారి ప్రశ్నించింది.
పిటిషన్ తిరస్కరణ..
తెలంగాణ గ్రూప్-1 పరీక్షకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతోందని ప్రభుత్వం తరఫు సీనియర్ అడ్వొకేట్ నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గత నెల 31న ఈ కేసు హైకోర్టు ముందు విచారణకు వచ్చిందని.. టీజీపీఎస్సీ ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు ముందు కౌంటర్ ఫైల్ చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వాదలను కౌంటర్ రూపంలో అందజేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. గ్రూప్-1 నియామక ప్రక్రియ పూర్తికి ఎంత సమయం పడుతుందని హైకోర్టు ప్రశ్నించగా.. పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించేందుకు మరో మూడు నెలలు పడుతుందని టీజీపీఎస్సీ తెలిపిందని వెల్లడించారు. ఆ సమయంలో సిబల్ కలుగజేసుకుని.. మూడు నెలల సమయం పడుతుంది కాబట్టివెంటనే విచారణ చేపట్టాలని కోరగా, అందుకు ధర్మాసనం నిరాకరించింది. ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని పునరుద్ఘాటించింది. హైకోర్టులో తదుపరి విచారణ నవంబర్ 20న ఉన్నందున, ఫలితాల కంటే ముందే విచారణను ముగించాలని హైకోర్టును ఆదేశించి.. ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది.