Share News

Sridhar Babu: క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో.. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా తెలంగాణ

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:37 AM

తెలంగాణాను త్వరలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌కు ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’గా మారుస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ పరిశోధన, అభివృద్ధిలో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న రాష్ట్రానికి.. సిలికాన్‌ వ్యాలీ సంస్థలను తీసుకొస్తామన్నారు.

Sridhar Babu: క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో.. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా తెలంగాణ

  • బీకాం, బీబీఎం విద్యార్థులకు సెకండియర్‌ నుంచే ఉపాధి శిక్షణ: మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణాను త్వరలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌కు ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’గా మారుస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ పరిశోధన, అభివృద్ధిలో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న రాష్ట్రానికి.. సిలికాన్‌ వ్యాలీ సంస్థలను తీసుకొస్తామన్నారు. ‘ఆరోగ్య సంరక్షణ రంగంలో కృత్రిమ మేధ’ అనే అంశంపై సోమవారం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఏఐజీ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి, సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీ ప్రతినిధి డాక్టర్‌ డియన్‌ హో, నారాయణ వైద్యాలయ వైస్‌ చైర్మన్‌ వీరేన్‌ శెట్టి, ప్రపంచ ఆరోగ్యసంస్థ డిజిటల్‌ హెల్త్‌ విభాగం సభ్యుడు డాక్టర్‌ రాజేంద్ర గుప్తా, తదితరులు పాల్గొన్న ఈ సదస్సులో మంత్రి శ్రీధర్‌ బాబు కీలకోపన్యాసం చేశారు. ప్రపంచ వ్యాక్సిన్‌ కేంద్రంగా ఘనత సాధించడంలో, హెల్త్‌ సైన్సె్‌సలో నగరాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన పారిశ్రామికవేత్తలు, సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌.. ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధను విస్తృతంగా వినియోగించే దిశగా ముందుకు నడుస్తోందని గుర్తుచేశారు. రేడియాలజీ రోగనిర్ధారణ పరీక్షల్లో స్పెషలిస్టు వైద్యులకు ఇప్పటికే ఏఐ తోడ్పడుతోందని.. దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా పరిశోధనలు జరగాలని ఆయన పిలుపునిచ్చారు.


ఏఐజీలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటుచేసి.. డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి ప్రపంచ ఆరోగ్యరంగానికి దిక్సూచిగా మారారని ప్రశంసించారు. కృత్రిమ మేధతో పనిచేసే ‘మిరా’ అనే వర్చువల్‌ వైద్య సహాయకురాలిని ప్రవేశ పెట్టి ఈ రంగంలో ఆయన ఆదర్శప్రాయులుగా నిలిచారని మంత్రి కొనియాడారు. వైద్య సంస్థలు, పరిశ్రమల్లో కృత్రిమ మేధను వినియోగించే సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. వైద్య సంరక్షణలో కృత్రిమ మేధ వినియోగంపై ఒక రోడ్‌ మ్యాప్‌ను రూపొందించాలని సీఎం రేవంత్‌ సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. రాష్ట్రంలో తాము యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తయారు చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. జీసీసీ కన్సార్షియం, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ రంగాలకు మరో కన్సార్షియం ఏర్పాటు చేశామని.. బీకాం, బీబీఎం విద్యార్థులకు కోర్సు రెండో సంవత్సరం నుంచే బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణనిస్తామని తెలిపారు. దేశంలో ఏటా ఈ రంగంలో 20 వేల ఉద్యోగ ఖాళీలు ఏర్పడుతున్నా నిపుణుల కొరత వల్ల అభ్యర్థులు దొరకట్లేదని పేర్కొన్నారు. అలాగే.. సైన్స్‌, ఫార్మా డిగ్రీ విద్యార్థులకూ కోర్సు పూర్తయ్యేలోగా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగానికి సంసిద్ధులుగా తీర్చిదిద్దుతామన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 01:37 AM