Share News

Sitarama Project: రూ.1335 కోట్లతో సీతారామ డిస్ట్రిబ్యూటరీలు

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:05 AM

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.13,057 కోట్ల వ్యయంతో చేపడుతున్న సీతారామ ఎత్తిపోతల పథకంలో పంపులు సిద్ధంగా ఉండటంతో పొలాలకు నీరందించే డిస్ట్రిబ్యూటరీల పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Sitarama Project: రూ.1335 కోట్లతో సీతారామ డిస్ట్రిబ్యూటరీలు

  • 4 ప్యాకేజీలకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం

  • ఎస్కేప్‌ కమ్‌ క్రాస్‌ రెగ్యులేటర్‌ నిర్మాణానికీ..

  • ఉమ్మడి ఖమ్మంలో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.13,057 కోట్ల వ్యయంతో చేపడుతున్న సీతారామ ఎత్తిపోతల పథకంలో పంపులు సిద్ధంగా ఉండటంతో పొలాలకు నీరందించే డిస్ట్రిబ్యూటరీల పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ఏడాది ఈ ప్రాజెక్టు కింద 1.20 లక్షల ఎకరాలకు పైగా నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలోని మూడు పంప్‌హౌ్‌సలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పంద్రాగస్టు రోజున ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, 2026 మార్చి నాటికి డిస్ట్రిబ్యూటరీ పనులను కూడా పూర్తిచేస్తామని ఆ సందర్భంగా సీఎం ప్రకటించారు.


ఈ ప్రాజెక్టు కింద 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కలుపుకొని 6.74 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పారు. సీఎం నిర్ణయానికి అనుగుణంగా పనులు పూర్తిచేసేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. కాగా, సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ పనులను 8 ప్యాకేజీలుగా విడగొట్టారు. ఈ పనులకు రూ.3,858.93కోట్లు అవుతాయని ప్రభుత్వం ఇదివరకే అంచనా వేసింది. ఈ మేరకు ఎనిమిది ప్యాకే జీల డిస్ట్రిబ్యూటరీ పనుల్లో నాలుగు ప్యాకేజీలకు శుక్రవారం టెండర్లు పిలుస్తూ నీటిపారుదల శాఖ నోటిఫికేషన్‌ ఇచ్చింది. డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ-1, 2, 7, 8లతోపాటు ఎస్కేప్‌ కమ్‌ క్రాస్‌ రెగ్యులేటరీ నిర్మాణం కోసం ఈ టెండర్లు పిలిచింది.


ప్యాకేజీ-1లో సీతారామ ఎత్తిపోతల పథకంలోని ప్రధాన కాలువ నుంచి 74 కిలోమీటర్ల దాకా క్రాస్‌ డ్రైనేజీ(సీడీ)తోపాటు క్రాస్‌ మాసానరీ(సీఎం) పనులతో కాలువల సిమెంట్‌/కాంక్రీట్‌ లైనింగ్‌ కోసం రూ.369.02 కోట్లు, ఇక ప్రధాన కాలువ 71 కిలోమీటర్ల నుంచి 98.350 కిలోమీటర్ల దాకా ప్యాకేజీ-2 కింద రూ.172.80 కోట్లతో, ఇక ప్యాకేజీ-7లో సీఎం అండ్‌ సీడీ పనులతో పాటు పాలవాగు ప్రధాన కాలువ, గొల్లగూడెం, వినాయకపురం, లింగసముద్రం డిస్ట్రిబ్యూటరీ పనులకు రూ.387.95 కోట్లతో, ప్యాకేజీ-8లో దమ్మపేట డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌తో పాటు సీఎం అండ్‌ సీడీ పనులకు రూ.348.63 కోట్లతో, భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మండలంలోని కోయగుట్ట వద్ద ఎస్కేప్‌ కమ్‌ క్రాస్‌ రెగ్యులేటరీతో పాటు అనుబంధ పనులకు రూ.56.98 కోట్లు కలిపి రూ.1335.40 కోట్లతో టెండర్లు పిలిచారు.

Updated Date - Oct 05 , 2024 | 04:05 AM