Share News

Shameem Akhtar: ఎస్సీ వర్గీకరణ కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ అక్తర్‌

ABN , Publish Date - Oct 12 , 2024 | 03:18 AM

రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల వర్గీకరణ దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. శుక్రవారం ఏకసభ్య న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

Shameem Akhtar: ఎస్సీ వర్గీకరణ కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ అక్తర్‌

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

  • నివేదిక సమర్పణకు 60 రోజుల సమయం

  • 2011 జనాభా లెక్కలే అధ్యయనానికి ప్రాతిపదిక

  • విధి విధానాల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల వర్గీకరణ దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. శుక్రవారం ఏకసభ్య న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌కు చైర్మన్‌గా తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ను నియమించింది. షెడ్యూల్డు కులాల ఉప-వర్గీకరణపై లోతైన అధ్యయనం నిర్వహించటానికి, సమస్యకు సంబంధించిన వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కమిషన్‌ నియామకానికి సంబంధించి శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్ల ఫలాలు ఎస్సీలలోని అన్ని వర్గాలకు అందేలా తీసుకోవాల్సిన చర్యలపై ఒక నివేదికను సమర్పించాలని జీవోలో పేర్కొంది. ప్రధానంగా మూడు అంశాలపై పరిపూర్ణ అధ్యయనం చేయాలని కమిషన్‌కు ఇచ్చిన విధి విధానాల్లో ప్రభుత్వం సూచించింది.


2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ కమిషన్‌ ఎస్సీల స్థితిగతులను అధ్యయనం చేస్తుంది. ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ వేసింది. మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ఎంపీ మల్లు రవి సభ్యులుగా ఉన్న ఈ కమిటీ.. వర్గీకరణపై లోతైన అధ్యయనం కోసం ఏకసభ్య న్యాయ కమిషన్‌ వేయాలని సిఫార్సు చేసింది. ఆ మేరకు జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కమిషన్‌ సమావేశాలను రాష్ట్రంలో ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 60 రోజుల వ్యవధిలో నివేదికను సమర్పించాలి. మౌలిక సదుపాయాలను ఎస్సీ అభివృద్ధి శాఖ సమకూర్చాలి. కమిషన్‌ అడిగిన అవసరమైన పత్రాలు, ఆధారాలను సంబంధిత అధికారులు అందజేయాలని నిర్దేశించింది. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ యాక్టు- 1952 ప్రకారం ఈ న్యాయ కమిషన్‌కు అధికారాలు సంక్రమిస్తాయి.


  • కమిషన్‌ విధివిధానాలు

  • తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డు కులాలలోని సజాతీయ ఉప కులాలను ఒక గుంపుగా చేరుస్తూ అన్ని కులాలను శాస్త్రీయ పద్ధతిలో హేతుబద్దంగా వర్గీకరించాలి. ఇప్పటికే అందుబాటులో ఉన్న సమకాలీన సమాచారం, 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలి.

  • షెడ్యూల్డ్‌ కులాల్లోని వివిధ ఉప సమూహాల మధ్య ఉన్న అంతరాలను గుర్తించేందుకు అనుభావిక అధ్యయనాలు నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో తగినంత ప్రాతినిధ్యం లేకపోవడంపై దృష్టి పెట్టాలి.

  • షెడ్యూల్డ్‌ కులాల్లోని ఉప సమూహాల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైన వెనుకబాటుతనాలకు సంబంధించిన వివిధ కోణాలను పరిశీలించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ కులాల ఉప వర్గీకరణను సమర్థవంతంగా అమలుచేసే విధానాన్ని గుర్తించాలి.

  • పైన పేర్కొన్న అంశాలపై నిర్దిష్ట సిఫార్సులతో నివేదికను సమర్పించాలి. రిజర్వేషన్‌ విధానాల ప్రయోజనాలను షెడ్యూల్డ్‌ కులాల్లోని వివిధ ఉప సమూహాల మధ్య సమానంగా పంపిణీ చేసేందుకు చేపట్టాల్సిన అన్ని ఇతర చర్యలను ఈ నివేదికలో సూచించాలి.

Updated Date - Oct 12 , 2024 | 03:18 AM