Exams: ముగిసిన గ్రూప్-1 పరీక్షలు
ABN , Publish Date - Oct 28 , 2024 | 04:16 AM
రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠ పరిస్థితుల మధ్య మొదలైన తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 29 వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు
అఖరి రోజు 67.3 శాతం మంది హాజరు
అన్ని పరీక్షలకు హాజరైంది 67.17 శాతం మంది
1:50 నుంచి 1:37కు తగ్గిన పోటీ
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠ పరిస్థితుల మధ్య మొదలైన తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 29 వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందంటూ... దాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో తీవ్రరూపం దాల్చిన ఆందోళనలు, మరోవైపు పరీక్షలు నిర్వహించే తీరుతామన్న ప్రభుత్వ ధోరణి, ఇంకోవైపు పరీక్ష రద్దుపై అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ... వీటన్నిటి మధ్య మరికొన్ని గంటల్లో పరీక్ష ప్రారంభమవుతుందనే వరకు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆఖరి ఘడియలో పరీక్ష నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఈ నెల 21వ తేదీన పరీక్షలు ప్రారంభమయ్యాయి.
అదేరోజు పరీక్ష కావడం, అప్పటికే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నందున వాయిదా వేయడం సాధ్యం కాదని సుప్రీం వెల్లడించడంతో మిగిలిన అభ్యర్థులు పరుగుపరుగున పరీక్ష కేంద్రాలకు తరలివెళ్లారు. 21వ తేదీన మొదలైన పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. వరుసగా ఏడు రోజుల పాటు మూడు జిల్లాల్లోని 46 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఆఖరి రోజున 21,151(67.3 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంతకుముందు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన మొత్తం 31,403 అభ్యర్థులకు గాను 21,093 మంది ఏడు పరీక్షలకు హాజరైనట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. దీంతో పూర్తి పరీక్షలకు హాజరైన అభ్యర్థుల శాతం 67.17గా నమోదైంది.
ఇందులో హైదరాబాదు జిల్లా కేంద్రాల్లో కేటాయించిన 5,613 మందికి గాను 4,719 మంది అభ్యర్థులు అన్ని పరీక్షలకు హాజరయ్యారు. అలాగే రంగారెడ్డిలో 8,011కు గాను 5,505 మంది, మేడ్చల్- మల్కాజ్‌గిరిలో 17,779కు గాను 10,869 మంది అభ్యర్థులు హాజరైనట్లు కమిషన్ ప్రకటించింది. రాష్ట్రంలో 563 గ్రూపు-1 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూన్‌లో ప్రిలిమనరీ పరీక్షను నిర్వహించింది. మొత్తం 4.03 లక్షల దరఖాస్తులు రాగా 3.02 లక్షల మంది ప్రిలిమ్స్‌కు హాజరయ్యారు. అందులో కనబరిచిన ప్రతిభ ఆధారంగా 1:50 నిష్పత్తిలో 31,403 అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేశారు. మెయిన్స్ పరీక్షలు మొదలయ్యాక తొలిరోజు హాజరైన అభ్యర్థులు 74శాతం కాగా క్రమంగా అది 67.3 శాతానికి తగ్గింది. దాంతో ఒక్కో పోస్టుకు 37 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు అయింది.