RTC: మహిళా సమాఖ్యలతో బస్సులు కొనిపిస్తాం..
ABN , Publish Date - Sep 30 , 2024 | 03:39 AM
రాష్ట్రంలోని మహిళా సమాఖ్యలచే బస్సులను కొనుగోలు చేయించి అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి నడిపించనున్నామని, ఆ మేరకు మెప్మాతో సంప్రదింపులు జరుపుతున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
వాటిని ఆర్టీసీకి అద్దెకు తీసుకుంటాం
త్వరలో ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీల భర్తీ
దశలవారీగా 2400 ఎలక్ర్టిక్ బస్సులు
మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, లింగాలఘణపురం, సిద్దిపేట అర్బన్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలోని మహిళా సమాఖ్యలచే బస్సులను కొనుగోలు చేయించి అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి నడిపించనున్నామని, ఆ మేరకు మెప్మాతో సంప్రదింపులు జరుపుతున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం కరీంనగర్, జనగామ జిల్లా లింగాలఘణపురంలో జరిగిన కార్యక్రమాల్లోనూ, సిద్దిపేటలో మీడియాతోనూ ఆయన మాట్లాడారు. కరీంనగర్-జేబీఎస్ మార్గంలో తిరిగే 35 ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను కరీంనగర్లో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి, మేడిపల్లి సత్యం, సంజయ్‌కుమార్‌లతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరీంనగర్లో త్వరలోనే ఇదే తరహాలో మరో 39 బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తుందన్నారు.
అలాగే, నిజామాబాద్‌కు 67, వరంగల్‌కు 86, సూర్యాపేటకు 52, నల్లగొండకు 65, హైదరాబాద్‌కు 74 ఈ తరహా బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. కాలుష్యరహిత సమాజం కోసం హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఎలక్ట్రిక్ బస్సులు నడపాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు దశలవారీగా 2400 బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ కసరత్తు చేస్తున్నదని తెలిపారు. అలాగే, మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తున్నదని చెప్పారు. కొత్త బస్సులకు సరిపడా ఉద్యోగ ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని, ఇప్పటికే 3035 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. 2013 బకాయిలకు సంబంధించిన బాండ్ల డబ్బును కండక్టర్లు, డ్రైవర్లకు సంస్థ చెల్లించిందని, దసరాలోపు మిగతా ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు.
మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను మాత్రమే తొలగిస్తున్నామని, నివాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని, ఎక్కడా బలవంతంగా ఇళ్లను కూల్చడం లేదని స్పష్టం చేశారు. కానీ, ప్రతిపక్షాలు కావాలనే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. వీలైనంత త్వరలో రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని, ఇందులో పార్టీ సీనియర్లకు న్యాయం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో కోర్టు తీర్పుకనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టేందుకు వేగవంతంగా కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పొన్నం చెప్పారు. కులగణన తర్వాత జనాభా ధామాషా ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. గీత కార్మికులకు చెల్లించాల్సిన ఎక్స్‌గ్రేషియా లాంటి బకాయిలను దసరాలోపు చెల్లించేందుకు ఆర్థిక శాఖను ఆదేశిస్తామని చెప్పారు.