Share News

TG News : డెంగీతో ఐదుగురి మృతి

ABN , Publish Date - Aug 21 , 2024 | 03:10 AM

డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా మనుషుల ప్రాణాలను హరిస్తూ వణికిస్తోంది. డెంగీ జ్వరాల బారిన పడి రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో ఐదు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

TG News : డెంగీతో ఐదుగురి మృతి

  • మృతుల్లో ఇద్దరు చిన్నారులు , ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు

  • రాష్ట్రంలో హడలెత్తిస్తున్నడెంగీ జ్వరాలు

  • భయాందోళనలో ప్రజలు

  • ప్రబలుతున్న డెంగీ.. హడలిపోతున్న ప్రజలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా మనుషుల ప్రాణాలను హరిస్తూ వణికిస్తోంది. డెంగీ జ్వరాల బారిన పడి రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో ఐదు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, సిద్దిపేట, కామారెడ్డి, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఈ మరణాలు సంభవించాయి. మూడేళ్లు, నాలుగేళ్లు వయస్సు ఉన్న ఇద్దరు చిన్నారులు, ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతుల జాబితాలో ఉన్నారు.

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం వెల్లటూరుకు చెందిన దాసు రామకోటయ్య కుమారుడు హర్షవర్దన్‌(3) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. తొలుత స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించిన తల్లిదండ్రులు హర్షను శుక్రవారం కోదాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు హర్షవర్దన్‌ డెంగీ బారిన పడ్డాడని పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ఖమ్మం ఆస్పత్రికి పంపారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సోమవారం హైదరాబాద్‌ తరలిస్తుండగా హర్షవర్దన్‌ మరణించాడు.

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు చెందిన గూబ అశోక్‌, అమల దంపతుల కుమార్తె హత్విక(4) డెంగీ బారిన పడి మంగళవారం ఉదయం మరణించింది. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న హత్వికకు తల్లిదండ్రులు వరంగల్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయితే, ప్లేట్‌లెట్లు పడిపోయి హత్విక పరిస్థితి విషమంగా మారడంతో వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున హత్విక ప్రాణం విడిచింది. అలాగే, కేసముద్రం మండలం బేరువాడ శివారు గుడితండాకు చెందిన బోడ శిరీష(34) తీవ్ర జ్వరంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించింది.


శిరీష మరణం డెంగీ వల్ల అని నిర్ధారణ కాలేదు. ఇక, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బాయంపల్లితండాకు చెందిన చౌహాన్‌ పీరేందర్‌(21) అనే బీటెక్‌ విద్యార్థి డెంగీ బారిన పడి మంగళవారం మరణించాడు. ఖమ్మంలో బీటెక్‌ చదువుతున్న పీరేందర్‌ గత శుక్రవారం స్వగ్రామానికి రాగా ఆదివారం నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి జ్వరం తీవ్రం కావడంతో కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా డెంగీ నిర్ధారణైంది.

మెరుగైన చికిత్స కోసం మంగళవారం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలోనే పీరేందర్‌ మరణించాడు. అదేవిధంగా, నాగర్‌కర్నూల్‌కు చెందిన మిరియాల నిఖిత(21) అనే బీటెక్‌ విద్యార్థిని కూడా డెంగీ బారిన పడి మరణించింది. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్‌ చదువుతున్న నిఖిత జ్వరంతో బాధపడుతూ ఇటీవల ఇంటికొచ్చింది.

అయితే, నిఖిత పరిస్థితి విషమంగా మారడంతో తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఇక, సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌ శివారు జ్యోతిరామ్‌ తండాకు చెందిన బోనోత్‌ కిషన్‌(47) డెంగీ బారిన పడి పదిహేను రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. ఈ మరణాలతో ఆయా ప్రాంతాల ప్రజలు హడలిపోతున్నారు. డెంగీ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Aug 21 , 2024 | 03:11 AM