Share News

Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నియంత్రణే లక్ష్యం!

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:23 AM

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించడమే తమ లక్ష్యమని రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి చెప్పారు.

Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నియంత్రణే లక్ష్యం!

  • ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు లింకు రోడ్ల విస్తరణ

  • 4 జిల్లాల్లో రైల్వే బ్రిడ్జిల నిర్మాణాలకు రూ.5 వేల కోట్లు: మల్‌రెడ్డి రాంరెడ్డి

రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 11: హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించడమే తమ లక్ష్యమని రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి చెప్పారు. రాష్ట్ర జనాభా నాలుగు కోట్లు కాగా.. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే రెండు కోట్ల మంది నివసిస్తున్నారని తెలిపారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా పెరిగిపోవడంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతోందన్నారు. బుధవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంరెడ్డి మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించాలంటే ఇన్నర్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు, అలాగే రీజనల్‌ రింగ్‌ రోడ్డు వరకు ఉన్న పాత లింకు రోడ్లను విస్తరించడమే మార్గమని తెలిపారు.


ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి హైదరాబాద్‌ రోడ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఇప్పటికే రూ.1500 కోట్ల పనులకు టెండర్లు వేసినట్లు చెప్పారు. మరో వెయ్యి కోట్లయినా సరే హైదరాబాద్‌తో పాటు నగరాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతం మొత్తానికి బ్రహ్మాండంగా రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. హయత్‌నగర్‌ నుంచి కోహెడలోని పండ్ల మార్కెట్‌ వరకు నాలుగు వరసల రోడ్డు నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో రైల్వే వంతెనల నిర్మాణం కోసం రూ.5 వేల కోట్లు మంజూరైనట్లు రాంరెడ్డి చెప్పారు. ఖమ్మం, ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో 54 రైల్వే అండర్‌ బ్రిడ్జిల పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

Updated Date - Sep 12 , 2024 | 03:23 AM