Share News

SC Caste Classification: ఎస్సీల వర్గీకరణ అమలుకు ఉప కమిటీ!

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:35 AM

స్సీల వర్గీకరణ అమలు కోసం ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి దామోదర రాజనర్సింహా నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని అనుకుంటోంది.

SC Caste Classification: ఎస్సీల వర్గీకరణ అమలుకు ఉప కమిటీ!

హైదరాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఎస్సీల వర్గీకరణ అమలు కోసం ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి దామోదర రాజనర్సింహా నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఎస్సీ వర్గీకరణను ఎలా అమలు చేయాలి? దాని విధివిధానాలు ఎలా ఉండాలనే అంశాల్ని ఈ కమిటీ పరిశీలిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో వర్గీకరణను అమలు చేసేందుకు ఎలాంటి కసరత్తు చేస్తున్నారో కమిటీ వివరాలు సేకరిస్తుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఇటీవల అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసింది.


కొద్దికాలానికే సుప్రీంకోర్టు వర్గీకరణకు రాజ్యాంగ బద్ధత ఉందని ప్రకటించింది.తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి వర్గీకరణను అమలుపరిచే తొలి రాష్ట్రం తెలంగాణే అవుతుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం సీఎం రేవంత్‌రెడ్డిని మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ఒక బృందం ఆయన నివాసంలో కలిసింది. రేవంత్‌ ప్రకటన పట్ల సంతోషం వ్యక్తం చేసింది. వీలైనంత త్వరలో వర్గీకరణను అమలు పర్చాలని మంద కృష్ణ కోరారు. ఈ సందర్భంగా, సీఎం రేవంత్‌రెడ్డి ఉప కమిటీ విషయాన్ని వెల్లడించారు.


వీలైనంత త్వరగా ప్రక్రియను ముగిస్తామని చెప్పారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గేలు కూడా వర్గీకరణకు అనుకూలంగా స్పందించేలా చూడాలని మంద కృష్ణ కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ, త్వరలో తాము తమ జాతీయ నేతల వద్దకు ఒక ప్రతినిధి బృందాన్ని పంపుతామని తెలిపారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి దామోదర రాజనర్సింహా, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎంపీ పసునూరి దయాకర్‌ తదితరులున్నారు.


  • శ్రీధర్‌బాబుతో భేటీ

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. మంద కృష్ణ, మాజీ మంత్రి నర్సింహులు గురువారం మంత్రి శ్రీధర్‌ బాబును కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాధ్యమైనంత త్వరలో వర్గీకరణను పూర్తి చేసి అమలు చేస్తామని వెల్లడించారు.

Updated Date - Aug 23 , 2024 | 03:35 AM