Ponnam Prabhakar: రోడ్డు ప్రమాదాల నివారణకు.. డ్రైవింగ్ ఎడ్యుకేషన్!
ABN , Publish Date - Oct 29 , 2024 | 03:25 AM
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సరికొత్త ప్రణాళికను అమలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. 80 శాతం రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల తప్పిదాల వల్లే జరుగుతుండడంతో.
లైసెన్స్ పొందేవారికి అవగాహన కార్యక్రమం
డాక్టర్ గురువారెడ్డి సర్వేజనా ఫౌండేషన్ సీఎ్‌సఆర్ నిధుల సహకారంతో నిర్వహణ: పొన్నం
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సరికొత్త ప్రణాళికను అమలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. 80 శాతం రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల తప్పిదాల వల్లే జరుగుతుండడంతో.. దీనిని అరికట్టేందుకు కంపల్సరీ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ (సీడీఈ) పేరుతో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనుంది. డాక్టర్ గురువారెడ్డి సీఎ్‌సఆర్ నిధుల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం రవాణా శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో సచివాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2023లో దేశంలో 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని ఇందులో 45 శాతం మంది 35 ఏళ్లలోపు వయసున్న యువత ఉన్నారని తెలిపారు. వీరిలోనూ 44 శాతం మంది ద్విచక్ర వాహన ప్రమాదాల్లో మరణించారని వెల్లడించారు.
ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకే సీడీఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. మొదటి దశలో ప్రయోగాత్మకంగా 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌లో ఆరు రవాణా శాఖ కేంద్రాల్లో దీనిని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లైసెన్స్ పొందాలనుకునే వారు..లెర్నింగ్ లైసెన్స్, శాశ్వత లైసెన్స్‌కి మధ్య వీడియో అవగాహన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. దీని ద్వారా కొత్తగా రోడ్డు మీదకి వస్తున్న వాహనదారులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. దీంతోపాటు విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకుగాను రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
యునిసెఫ్ రవాణా విభాగం ద్వారా దీనిని నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రోడ్ ేసఫ్టీ కార్యక్రమంలోపు రాష్ట్రవ్యాప్తంగా 300 మంది రవాణా శాఖ అధికారులు 300 స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మంత్రి పొన్నం ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికా్‌సరాజ్, డిప్యూటీ సెక్రటరీ శోభారాణి, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు రమేశ్, మమత, గురువారెడ్డి సర్వేజనా ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.