Accident: ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..
ABN , Publish Date - Aug 16 , 2024 | 04:11 AM
దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడి.. ముగ్గురిని కబలించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పెద్దగోల్కొండ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
పెద్దగోల్కొండ వద్ద తూఫాన్ను ఢీకొట్టిన కారు
ముగ్గురి మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం
శంషాబాద్ రూరల్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడి.. ముగ్గురిని కబలించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పెద్దగోల్కొండ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న తూఫాన్ వాహనాన్ని ఓ కారు వేగంగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏసీపీ కె.శ్రీనివా్‌సరావు తెలిపిన వివరాల మేరకు.. వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన 24 మంది తూఫాన్ వాహనంలో గురువారం ఉదయం యాదగిరిగుట్టకు బయలుదేరారు. దైవదర్శనం అనంతరం తిరిగి సొంతూరికి వెళ్తుండగా.. పెద్దగోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఓ బాలెనో కారు.. మరో కారును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి ముందు వెళ్తున్న తూఫాన్ను బలంగా ఢీకొంది. దాంతో తూఫాన్ నాలుగైదు పల్టీలు కొట్టడంతో డ్రైవర్ మహ్మద్ తాజ్ (40), వరాలు (43) అక్కడికక్కడే మృతి చెందారు.
ఆస్పత్రికి తరలిస్తుండగా 2 నెలల బాబు కూడా ప్రాణాలు విడిచాడు. బాబు తల్లి అర్చన, దీక్షిత, కీర్తి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన బాలెనో కారు తుక్కుగూడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్నట్లు శంషాబాద్ పోలీసులు తెలిపారు. అందులో కరీంనగర్‌కు చెందిన ఆరుగురు యువకులున్నారని.. వారిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. వీరిలో కొందరు మద్యం సేవించినట్లు అనుమానిస్తున్నారు.