Miyapur: మియాపూర్‌లో చిరుత
ABN , Publish Date - Oct 19 , 2024 | 03:30 AM
హైదరాబాద్‌లో చిరుత సంచారం కలకలం రేపింది.. రద్దీగా ఉండే మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత పులి కనిపించడంతో అక్కడి వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మెట్రోస్టేషన్ సమీపంలో సంచారంతో కలకలం
సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారులు
మెట్రో వెనుక ఉన్న అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్లు
అనుమానం.. చిరుత జాడ కోసం సీసీ కెమెరాలు
మియాపూర్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో చిరుత సంచారం కలకలం రేపింది.. రద్దీగా ఉండే మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత పులి కనిపించడంతో అక్కడి వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మెట్రో స్టేషన్ వెనుక భాగంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు చిరుతను చూశారు. తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు.
చిరుత ఎక్కడి నుంచి వచ్చింది..? ఎక్కడెక్కడ తిరిగింది..? అన్నది గుర్తించే ప్రయత్నం చేశారు. రాత్రి సమయం కావడంతో చిరుత ఆనవాళ్లు, అడుగుల గుర్తింపులో ఇబ్బంది ఉందని ఓ అధికారి తెలిపారు. మెట్రో స్టేషన్ వెనకాల 200 ఎకరాల మేర ఖాళీ స్థలం, దట్టమైన అడవి ఉంది. అందులో నుంచే పులి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పులి జాడ గుర్తించాలని నిర్ణయించారు. చిరుత సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్థానికులకు సూచించారు. గతంలో పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లోనూ పులి కనిపించిందని స్థానికులు గుర్తు చేస్తున్నారు.