Share News

Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్‌ పనైపోయింది

ABN , Publish Date - Nov 19 , 2024 | 02:16 AM

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పనైపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఆ పార్టీలో కేసీఆర్‌, ఆయన కొడుకు, బిడ్డ మాత్రమే మిగులుతారని ఎద్దేవా చేశారు.

Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్‌ పనైపోయింది

  • ఆ పార్టీలో తండ్రి, కొడుకు, బిడ్డే మిగులుతారు.. హరీశ్‌, మిగతా వాళ్లు వేరే దారి చూసుకుంటారు

  • బీఆర్‌ఎస్‌ పదేళ్ల, ప్రస్తుత పాలనపై చర్చకు సిద్ధమేనా?

  • గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలకే కేసీఆర్‌ టైమ్‌ ఇవ్వలేదు

  • కాంగ్రె్‌సలో పూర్తి స్వేచ్ఛ.. కార్యకర్తలూ సీఎంను కలవొచ్చు

  • కష్టపడ్డ కార్యకర్తలను స్థానిక ఎన్నికల్లో గెలిపించుకుంటాం

  • ఈ ఐదేళ్లే కాదు.. వచ్చే ఐదేళ్లూ కాంగ్రెస్‌ పార్టీదే అధికారం

  • రాహుల్‌ ప్రధాని కావడం ఖాయం: టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌

  • సంగారెడ్డిలో భారీ ర్యాలీతో స్వాగతం పలికిన జగ్గారెడ్డి

సంగారెడ్డి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పనైపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఆ పార్టీలో కేసీఆర్‌, ఆయన కొడుకు, బిడ్డ మాత్రమే మిగులుతారని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావుతోపాటు మిగతా వారందరూ పలాయనం చిత్తగించి వేరే దారి చూసుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. సంగారెడ్డిలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్‌ జిల్లా కార్యకర్తల సమావేశానికి మహేశ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ గతంలో బీజేపీతో కుమ్మక్కై సర్కార్‌ను కూలుస్తామంటూ బీఆర్‌ఎస్‌ ప్రగల్భాలు పలికిందని, ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రె్‌సలో చేరారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్‌లైన్‌తో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలు.. వాటిని విస్మరించారని ఆరోపించారు. నీళ్ల ప్రాజెక్టుల పేరిట కుంభకోణాలు చేశారని విమర్శించారు.


నిధులన్నీ పక్కదారి పట్టించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. నియామకాల పేరిట నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆగం చేస్తే... తాము మరమ్మతులు చేసుకుంటూ వస్తున్నామని వివరించారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్‌ కుటుంబం బంగారుమయంగా మారిందని ధ్వజమెత్తారు. వారి పదేళ్ల పాలన, తమ పదకొండు నెలల పాలనపై హరీశ్‌రావు చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ పాలనలో హంగులు, ఆర్భాటాలు లేవని, అభివృద్ధి, సంక్షేమం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లు కాదు.. వచ్చే ఐదేళ్లూ కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలో ఉంటుందన్నారు. కేంద్రంలోనూ రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.


  • కాంగ్రె్‌సకు కార్యకర్తలే బలం..

కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన ఘనత టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డికే దక్కుతుందని మహేశ్‌గౌడ్‌ కొనియాడారు. కాంగ్రె్‌సలో కార్యకర్తలకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంటుందని, ముఖ్యమంత్రిని సైతం నేరుగా కలిసే అవకాశం ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్‌ తన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు కూడా సమయం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రె్‌సకు కార్యకర్తలే ప్రధాన బలం, బలగం అని పునరుద్ఘాటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలను గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే పలు కార్పొరేషన్‌ పదవులు భర్తీ చేశామని, జనవరిలోగా మిగతావీ భర్తీ చేస్తామని ప్రకటించారు. సమావేశంలో మంత్రి దామోదర, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి, సెట్విన్‌ చైర్మన్‌ గిరిధర్‌రెడ్డి, యూత్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 02:16 AM