Narsapur: అతివేగంతో అంతులేని విషాదం!
ABN , Publish Date - Oct 17 , 2024 | 04:27 AM
బంధువుల ఇంట్లో అమ్మవారి పండుగ జరుపుకుని ఆనందంగా ఇంటికి తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం కథ విషాదాంతమైంది.
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లిన కారు
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి దుర్మరణం
మృతుల్లో ముగ్గురు బాలికలు, ముగ్గురు మహిళలు
మెదక్ శివ్వంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
శివ్వంపేట/నర్సాపూర్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): బంధువుల ఇంట్లో అమ్మవారి పండుగ జరుపుకుని ఆనందంగా ఇంటికి తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం కథ విషాదాంతమైంది. అతివేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఎగిరి చెట్టును ఢీకొట్టి ఆపై వాగులోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మెదక్ జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జిల్లాలోని శివ్వంపేట మండలం తాళ్లపల్లితండాకు చెందిన దనావత్ శివరామ్(55), దనావత్ దుర్గి (45) దంపతులు, జగ్యతండాకు చెందిన మాలోత్ అనిత(30) ఆమె కుమార్తెలు మాలోత్ బిందు(14), మాలోత్ శ్రావణి(12), బీమ్లాతండాకు చెందిన గుగ్లోత్ శాంతి(38) ఆమె కుమార్తె గుగ్లోత్ మమత(16) ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదానికి సంబంధించి తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శివరామ్ దంపతులు తమ కుమార్తెలు శాంతి, అనిత, మనుమరాళ్లు బిందు, శ్రావణి, మమత, శాంతి భర్త నాన్‌సింగ్‌తో కలిసి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సీతారాంపల్లితండాలోని బంధువుల ఇంటికి మంగళవారం కారులో వెళ్లారు. అక్కడ ఎల్లమ్మ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని బుధవారం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మరో అరగంటలో ఇంటికి చేరతారనగా బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
శివ్వంపేట మండలం ఉసిరికపల్లి చౌరస్తా నుంచి వెల్దుర్తి వెళ్లే రోడ్డులో ఉసిరికపల్లి సమీపంలో అదుపు తప్పి మన్నెనోని వాగు వద్ద చెట్టును బలంగా ఢీకొట్టి ఆపై వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రహదారి విస్తరణ పనులు జరుగుతుండగా అతి వేగం వల్ల కారు అదుపు తప్పింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అవ్వగా.. డ్రైవింగ్ సీటులో ఉన్న నాన్‌సింగ్ మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన నాన్‌సింగ్‌ను తొలుత బయటికి తీశారు. అనంతరం కారులో చిక్కుకున్న మృతదేహాలను స్థానికులు, పోలీసులు వెలికి తీశారు. కాగా, ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ప్రమాదం వివరాలను తెలుసుకున్నారు.