Tummala Nageswara Rao : మాఫీ ప్రక్రియ మధ్యలో ఉంది
ABN , Publish Date - Aug 28 , 2024 | 04:12 AM
రైతు రుణమాఫీ ప్రక్రియ మధ్యలో ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వా రం పదిరోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేసి, రేషన్ కార్డు లేని రైతు కుటుంబాలను గుర్తిస్తామని, యాప్ ద్వారా వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. మిగిలిన రూ.18 వేల కోట్ల రుణమాఫీ సొమ్ము తప్పకుండా రైతు ఖాతాల్లో జమచేసి తీరుతామని, ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదన్నారు.
వారం పదిరోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి
రేషన్‌కార్డు లేని రైతులను గుర్తిస్తాం
మరో 18వేల కోట్లు వారి ఖాతాల్లో
జమ చేస్తాం.. మంత్రి తుమ్మల వెల్లడి వారం పదిరోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి
రైతు సంఘాల ధర్నాలో మంత్రి తుమ్మల
హైదరాబాద్, ఖమ్మం, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రైతు రుణమాఫీ ప్రక్రియ మధ్యలో ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వా రం పదిరోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేసి, రేషన్ కార్డు లేని రైతు కుటుంబాలను గుర్తిస్తామని, యాప్ ద్వారా వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. మిగిలిన రూ.18 వేల కోట్ల రుణమాఫీ సొమ్ము తప్పకుండా రైతు ఖాతాల్లో జమచేసి తీరుతామని, ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదన్నారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద సీపీఎం, సీపీఐ రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన, ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా వద్దకు చేరుకున్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా 42 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.2 లక్షల లోపు మొత్తం రూ.31వేల కోట్ల రుణబాకీ ఉందని తెలిపారు. ఆయా బ్యాంకులు ఇచ్చిన జాబితాల ప్రకారంగానే దశలవారీగా రైతు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికీ రాష్ట్రంలో రూ.2లక్షలలోపు రుణాలున్న 22 లక్షలమంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మాఫీ నిధులు జమ చేసినట్లు తెలిపారు. ఇంకా రూ.18వేల కోట్లు జమ చేయాల్సి ఉందన్నారు. ఇంటింటి సర్వే ద్వారా రేషన్‌కార్డు లేని రైతు కుటుంబాలను నిర్ధారణ చేసి యాప్ ద్వారా పాస్‌బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. రూ.2 లక్షలపైన బకాయి ఉన్నవారు సుమారు 12వేల మంది రైతులున్నారని, త్వరలో మంత్రివర్గ భేటీలో వీరిందరి విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
బ్యాంకు డేటాలో తప్పులుంటే సరిచేయాలి
రైతులు రుణమాఫీ పథకానికి అర్హులై బ్యాంకుల నుంచి వచ్చిన డేటాలో తప్పులుంటే సరిచేయాలని మంత్రి తుమ్మ ల అఽధికారులను ఆదేశించారు. కుటుంబ సభ్యులు నిర్ధారణ కాని రైతులకోసం ప్రత్యేక యాప్ రూపొందించామని తెలిపారు. ఈనెల 25, 26 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ట్రయల్ రన్ చేసినట్లు తెలిపారు. నేటినుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో మండల వ్యవసాయశాఖ అధికారులు(ఏవో)లు ఇంటింటి సర్వే నిర్వహించి వివరాలు అప్‌లోడ్ చేస్తారని తెలిపారు.
మంగళవారం రైతువేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లలో ఉన్న ఏఈవోలు, ఏవోలతో మంత్రి తుమ్మల మాట్లాడారు. ఆగస్టు 15 నాటికి 22,37,848 లక్షల మంది రైతులకు 2 లక్షల లోపు ఉన్న పంట రుణమాఫీ చేశామని తెలిపారు. రేషన్ కార్డులు లేకుండా కుటుంబ నిర్ధారణ కాని రైతుల వివరాలు సేకరించి పోర్టల్‌లో నమోదు చేయటం జరుగుతుందన్నారు. తప్పుగా నమోదైన 1,24,604 ఆధార్ వివరాలను బ్యాంకులకు సరిచేయడానికి ఇచ్చామని, ఇప్పటివరకు 41,339 ఆధార్ వివరాలను సరిచేసినట్లు తెలిపారు.