Share News

Year Ender 2024: భవిష్యత్తును భయపెడుతున్న ఈ ఏడాది అటవీ విధ్వంసం

ABN , Publish Date - Dec 31 , 2024 | 09:42 AM

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లో ఈ ఏడాది ఆగస్టు 31న సుమారు 15 కిలో మీటర్ల వ్యవధిలో 200 హెక్టార్లలో 50 వేలకు పైగా అరుదైన జాతి వృక్షాలు నేలమట్టం అయ్యాయి. ఆగస్టు 31 సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య.. అంటే రెండు గంటల వ్యవధిలోనే ఈ విధ్వంసం చోటు చేసుకుంది.

Year Ender 2024: భవిష్యత్తును భయపెడుతున్న ఈ ఏడాది అటవీ విధ్వంసం
Medaram Forest

ప్రకృతిని మానవుడు విధ్వంసం చేస్తే.. ఆ ప్రకృతి కోపానికి మానవాళి బలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పెరుగుతున్న జనాభాకు వారి అవసరాల కోసం అడవులను కూడా నేలమట్టం చేసి నివాసాలుగా మార్చేస్తున్నారు. పచ్చని చెట్లను కూకటివేళ్లతో పెకిలించి మరీ ప్రజలు తమ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఎన్నో దట్టమైన అడవులు చాలా వరకు కనుమరుగవుతున్నాయి. ప్రకృతిని విధ్వంసం చేస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో అని మానవాళికి ప్రకృతి పలు రకాలుగా హెచ్చరికలు చేస్తూనే ఉంది. సునామీలు, భూకంపాలు ఇలా ఎన్నో రకాలుగా ప్రకృతి మనకు అనేక రకాలుగా హెచ్చరికలు ఇస్తూనే ఉంటుంది. ఈ ఏడాది మేడారం అడవుల్లో ఒకేసారి వేలల్లో చెట్లు నేలకూలడం కూడా ప్రకృతి హెచ్చరికల్లో భాగమే అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో నరికివేసినట్లుగా ఒకేసారి పెద్ద సంఖ్యలో చెట్లు నేలరాడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. గంటల వ్యవధిలోనే ఇంత పెద్ద సంఖ్యలో చెట్లు నేలరాలడానికి కారణమేంటి.. ఇది ప్రకృతి ప్రకోపమా.. లేక మరేదైనా కారణమా అనే అనుమానాలు ఉన్నాయి.


కూటివేళ్లతో నేల కూలిన చెట్లు

medaram-1.jpg

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లో ఈ ఏడాది ఆగస్టు 31న సుమారు 15 కిలో మీటర్ల వ్యవధిలో 200 హెక్టార్లలో 50 వేలకు పైగా అరుదైన జాతి వృక్షాలు నేలమట్టం అయ్యాయి. ఆగస్టు 31 సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య.. అంటే రెండు గంటల వ్యవధిలోనే ఈ విధ్వంసం చోటు చేసుకుంది. ఆ సమయంలో ఒక్కసారి మేఘాలు కమ్ముకుని అకస్మాత్తుగా పెనుగాలులు, భారీ వర్షం కురిసింది. ఆ తరువాత చెట్లన్నీ వరుసగా నేలమట్టం అయ్యాయి. ఎవరో గీత గీసి నరికేశారా అన్న రీతిలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. సాధారణంగా తుపాన్లు వంటివి వచ్చినప్పుడు ఒకట్రెండు చెట్లు పడిపోవడం సర్వసాధారణమని.. కానీ ఇక్కడ ఏకంగా 80 వేల నుంచి లక్ష చెట్ల వరకూ కూకటివేళ్లతో నేల కూలాయని అటవీ అధికారులు చెబుతున్నారు. మొదట్లో 50 వేల చెట్లని అంతా భావించారు.. కానీ 80 వేల నుంచి లక్ష వరకూ చెట్లు కూలినట్లు తెలుస్తోంది.


జంతువులు, పక్షులు సేఫ్..

medaram-2.jpg

కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం కోనెపల్లి వరకు చెట్లన్నీ నేలకూలాయి. ఈ విధ్వంసంలో అడవిలో ఉండే అరుదైన వృక్షాలు కూడా విరిగిపోయాయి. జువ్వి, నారెప, నల్లమద్ది, తెల్లమద్ది, మారేడు, ఇప్ప వంటి చెట్లు ధ్వంసమయ్యాయి. ఇంత పెద్ద విధ్వంసం చోటు చేసుకున్నా.. భారీ వృక్షాలు నేలకొరిగినా.. అక్కడి జంతువులకు, పక్షులకు హానీ జరిగినట్లు ఆనవాళ్లేవీ కనిపించలేదు. ఇంత పెద్ద విపత్తులోనూ ఒక్క జంతువు గానీ, ఒక్క పక్షి గానీ గాయపడినట్లు, చనిపోయినట్లు వెలుగుచూడలేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ ఊహించని విపత్తుతో అడవి బిడ్డలు, ఆదివాసీలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. ఏళ్ల నాటి మహా వృక్షాలు కూడా సుడిగాలి భీభత్సానికి నేలరాడం అందరినీ షాక్‌కు గురయ్యేలా చేసింది. తాడ్వాయి-మేడారం రోడ్డుకు అడ్డంగా సుమారు 200 చెట్లు కూలడంలో రాకపోకలు బంద్ నిలిచిపోయాయి. దీంతో అదే రోజు రాత్రి రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్లు జేసీబీల సాయంతో చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

మందుబాబులకు బంపర్ ఆఫర్.. పది తర్వాత పూర్తి ఫ్రీ..


విపత్తుకు కారణం ఇదే అన్న అధికారులు..

medaram-4.jpg

అడవిలో భారీగా చెట్లు నేటకూలిన వార్త తెలంగాణ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. అడవిలో జరిగిన అల్లకల్లోల్లాన్ని అటవీ అధిరాలు నేరుగా వెళ్లి పరిశీలించారు. పీసీసీఎఫ్ డోబ్రియాల్, కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్, భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ భీమా నాయక్, ములుగు డీఎఫ్ వో రాహుల్ కిషన్ జాదవ్ క్షేత్రస్థాయిలో పర్యటించి కూలిపోయిన చెట్లను పరిశీలించారు. పెద్ద వృక్షాలు కూడా చిగురుటాకుళ్లా నేలరాడం పట్ల అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే అడవిలో విధ్వంసంపై అటవీ అధికారులు విచారణ చేపట్టారు. అటవీశాఖ అధికారులు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌ను కూడా ఆశ్రయించారు. ఈ ఘటనపై తెలంగాణ అటవీ శాఖ పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ డోబ్రియాల్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. క్లౌడ్ బరస్ట్ వల్లే ఈ విపత్తు సంభవించిందని... మేఘాలు కిందకు వచ్చి బరస్ట్ కావడంతోనే చెట్లు నేలకూలాయని తెలిపారు. 3 కిలోమీటర్ల పొడవు, 2 కిలో మీటర్ల వెడల్పులో 204 హైక్టార్లలో 50వేల చెట్లు కూలాయన్నారు. క్లౌడ్ బరస్ట్ ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కు తెలియజేశామన్నారు. మేడారం అడవుల్లో చెట్ల వేళ్లు లోతుగా లేవని... అందుకే వందల ఎకరాల్లో అడవి ధ్వంసమైందని ప్రభుత్వానికి పంపిన నివేదికలో పీసీసీఎఫ్ పేర్కొన్నారు. అలాగే విధ్వంసమైన చెట్లలో ఎంతో విలువైన ఉన్నాయని వాటిని డిపోలకు పంపుతున్నట్లు డోబ్రియాల్ తెలిపారు.


మరో అభిప్రాయం ఏంటంటే..

medaram-3.jpg

అయితే క్లౌడ్ బరస్ట్ వల్లే ఈ విధ్వంసమని అటవీ అధికారులు చెబుతుండగా.. టోర్నడోలాంటి సుడగాలి కూడా కారణం కావచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో అధికారులు... వాతావరణ శాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (SRSC) శాస్త్రవేత్తలను ఆశ్రయించారు. ఇప్పటికే అడవిలోని మట్టిని పరీక్షల నిమిత్తం ల్యాబ్స్‌కు పంపించారు. మరోవైపు విధ్వంసానికి గురైన అడవిని మళ్లీ పునరుద్ధరించే పనిలో పడ్డారు అటవీశాఖ అధికారులు. అయితే చెట్టు పెరిగేందుకు ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. మంచి నేల, మంచి విత్తనాలు అందుబాటులో ఉన్నందున చెట్లన్నీ వేగంగా పెరుగుతాయని అటవీ అధికారుల అంచనా వేస్తున్నారు.


అంతా యాదృచ్ఛికమే...

earth quake.jpg

కాగా.. ఇటీవల హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో స్వల్ప భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం ములుగు సమీపంలోని మేడారంలో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది. దీంతో అడవుల్లో విధ్వంసానికి, ఈ భూకంపానికి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం లేదని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తేల్చి చెప్పింది. అప్పుడు చెట్లు కూలిపోవడం, ఇప్పుడు భూకంపం రావడం అనేది పూర్తిగా యాదృచ్ఛికమని శాస్త్రవేత్తలు చెప్పారు.


మరిన్ని Year Ender 2024 వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి..

ఉగాది నుంచి ఉచితం

Ration Rice Case: దూకుడు పెంచిన పోలీసులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 31 , 2024 | 09:42 AM