Share News

Year Ender 2024: పోలీసులకు కష్ట కాలం.. ఈ ఏడాది ఆందోళన బాట

ABN , Publish Date - Dec 28 , 2024 | 10:01 AM

Year Ender 2024: తెలంగాణ పోలీసు విభాగంలో ఈ ఏడాది ముఖ్య ఘటను చోటు చేసుకున్నాయి. ముఖ్యమంగా టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన సంచలనాన్ని రేపింది. ఏక్‌ పోలీస్ విధానం అంటూ టీజీఎస్పీ సిబ్బంది పోరుబాట పట్టారు.

Year Ender 2024: పోలీసులకు కష్ట కాలం.. ఈ ఏడాది ఆందోళన బాట
Year ender 2024 TGSP Dharna

‘‘ఏక్ పోలీస్ విధానం’’ అంటూ తెలంగాణలో టీజీఎస్పీ(తెలంగాణ స్పెషల్ పోలీస్) బెటాలియన్ సిబ్బంది ఆందోళన ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఒక్క సారిగా పోలీసులు, పోలీసుల కుటుంబాలు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయడం రాష్ట్ర పోలీస్‌ శాఖను షాక్ గురిచేసేలా చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో చాలా మంది పోలీసులు రోడ్డుపైకి వచ్చి తమ డిమాండ్ నెరవేర్చాలంటూ పట్టుబట్టారు. పోలీసులు నిరసన సెగ సచివాలయానికి కూడా తాకింది. అయితే ఆందోళనకు దిగిన పోలీసులపై ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. నిరసనకు దిగిన అనేక మందిపై వేటు వేశారు. అసలు పోలీసులు ఎందుకు ఆందోళనకు దిగారు?... ఏక్ పోలీస్ విధానం అంటే ఏంటి?.. చివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.


టీజీఎస్పీ ఎప్పుడు ఏర్పడింది..

tgsp.jpg

1950లో రెండు బెటాలియన్లతో హైదరాబాద్ స్టేట్ రిజర్వ్ పోలీసు విభాగం ఏర్పాటు అవగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 1957 నుంచి దీన్ని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్‌గా పిలిచారు. అయితే తెలంగాణ విభజన తరవాత 10 బెటాలియన్లతో తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగం (టీజీఎస్పీ) ఏర్పాటైంది. ఆ తరువాత అదనపు బెటాలియన్ల ఏర్పాటుతో ప్రస్తుతం ఈ సంఖ్య ప్రస్తుతం 13కు పెరిగింది. ఒక్కో బెటాలియన్‌లో అధికారులు, సిబ్బంది కలిపి వెయ్యి మంది వరకు ఉంటారు. రాష్ట్ర డీజీపీ పర్యవేక్షణలో ఈ బెటాలియన్లు ఉంటాయి. ప్రతీ బెటాలియన్‌కు ఎస్పీ ర్యాంకు కమాండెంట్ ఆధ్వర్యంలో కొనసాగగా.. పరిపాలన వ్యవహారాలను డీజీ ఆధ్వర్యంలో కొనసాగుతాయి. టీజీఎస్పీ పోలీసులు సిబ్బంది శాంతిభద్రతల విధులు నిర్వహిస్తుంటారు. ఇతర రాష్ట్రాల ఎన్నికలు, వివిధ ఉత్సవాల బందోబస్తుల్లో విధులు నిర్వహిస్తుంటారు.


సర్క్యులర్ తెచ్చిన తంట..

tgsp.jpg

ఇదిలా ఉండగా... స్పెషల్ పోలీస్ బృందాల్లో క్షేత్రస్థాయి విధుల నిర్వహించేవారి సంఖ్యను పెంచాలని, వారికి సెలవుల విధానాన్ని పునర్వ్యవస్థీకరించాలని ఈ ఏడాది అక్టోబర్ 10న ఒక సర్క్యులర్ జారీ అయ్యింది. ఇది అమలు అయితే గతంలో ఉన్న 15 రోజులకు నాలుగు రోజుల సెలవు విధానం స్థానంలో ఒక నెలలో వరుసగా 26 రోజులు డ్యూటీలు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా అవసరమైతే అదనంగా మరికొన్ని రోజులు కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తూ టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన బాట పట్టారు.


టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన

tgsp.jpg

ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది అక్టోబర్‌లో తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగంలోని సిబ్బంది, వారి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేయడంతో పాటు, సెలవులు ఇవ్వకపోవడం, ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. పోలీసులతో వారి పనులు కాకుండా వెట్టి చాకిరీలు చేయిస్తున్నారని, నెలల తరబడి కుటుంబాలకు దూరంగా డ్యూటీలు వేస్తున్నారని టీజీఎస్పీ పోలీసు కుటుంబాలు ఆరోపించాయి.


ఎస్పీ కాళ్లపై పడిన సిబ్బంది..

tgsp.jpg

ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా మామునూరులో 4వ బెటాలియిన్ కానిస్టేబుళ్లు, నల్గొండ సమీపంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళనకు దిగారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నంలో కానిస్టేబుళ్ల కుటుంబసభ్యలు నిరసనకు దిగారు. స్పెషల్‌ పోలీస్‌ అంటూ మమ్మల్ని బెటాలియన్‌లో కానిస్టేబుళ్లుగా మార్చి వెట్టి చాకిరీ చేయిస్తున్నారంటూ సిరిసిల్లలోని 17వ పోలీస్‌ బెటాలియన్‌ కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్ల ఆవేదనను వినేందుకు వచ్చి ఎస్పీ అఖిల్ మహాజన్‌ కాళ్లపై పడి వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించాలని, ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మంచిర్యాల జిల్లా గుడిపేటలోని 13వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్‌ జిల్లా యాపల్‌గూడలోని రెండో బెటాలియన్‌ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. కొత్తగూడెం జిల్లా చాతకొండకు చెందిన ఐఆర్‌ 6వ బెటాలియన్‌ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు లక్ష్మీదేవిపల్లి ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.


సచివాలయం వద్ద నిరసన..

tgsp.jpg

అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నపటికీ పట్టించుకోకపోవడంతో అక్టోబర్ 25 న సచివాలయం ముట్టడికి కూడా యత్నించారు పోలీసులు. దీంతో టీజీఎస్పీ సిబ్బంది భార్యలతో పాటు వారి కుటుంబ సభ్యులను మహిళా కానిస్టేబుళ్లు అరెస్టు చేశారు. స్పెషల్‌ పోలీసులకూ ఇతర పోలీసుల్లాగే ఒకే చోట కనీసం ఐదేళ్లు ఉద్యోగం చేసే అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అయితే వీరి అరెస్ట్‌కు నిరసనగా కొండాపూర్ ప్రధాన రాహదారిపై టీజీఎస్పీ 8వ బెటాలియన్‌ పోలీసులు ఆందోళనకు దిగారు. అలాగే సిరిసిల్ల, నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి, గద్వాల జిల్లా ఎర్రవల్లిలోని జాతీయ రహదారులపై బైఠాయించి ఆందోళనకు దిగారు.


సర్క్యులర్ వెనక్కి...

tgsp.jpg

టీజీఎస్పీ ఆందోళనల నేపథ్యంలో ఈ సర్క్యులర్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీజీఎస్పీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సంజయ్ జైన్ ప్రకటించారు. అయినప్పటికీ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళనను కొనసాగించారు. ఈ విషయాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. అలాగే పోలీసుల ధర్నాలు, ఆందోళనలపై కన్నెర్న చేసిన తెలంగాణ పోలీస్ శాఖ... పోలీస్ ఉద్యగంలోఉంటూ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఆర్టికల్ 311ను ప్రయోగించింది. అక్టోబర్ 26న 39 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ పోలీస్‌శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. వీరిలో కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు ఉన్నారు. పోలీస్‌ యూనిఫాం క్రమశిక్షణకు మారుపేరని, యూనిఫాం సర్వీ్‌స్‌లో ఉండి నిరసనలకు దిగడం సరికాదని డీజీపీ జితేందర్‌ అన్నారు.


ఏక్ పోలీస్ విధానం అంటే..

tgsp.jpg

గతంలో పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ విధానం సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ పోలీసు విభాగాలకు వేర్వేరుగా ఉండేది. ప్రస్తుతం కంబైన్డ్ నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేస్తున్నారు. పరీక్షలో అభ్యర్థుల మెరిట్ ఆధారంగా వారిచ్చిన ప్రాధాన్యతా క్రమంలోని సివిల్, అగ్నిమాపక, రిజర్వ్, స్పెషల్ పోలీస్, జైళ్లశాఖ వంటి విభాగాలకు ఎంపిక జరుగుతుంది. ఇలా ఒకే పరీక్ష ద్వారా ఎంపికైన తమకు మిగతా వారితో పోలిస్తే విధుల్లో పొంతనే లేదని టీజీఎస్పీ కానిస్టేబుళ్లు చెబుతున్నారు. తమిళనాడు, కర్ణాటక తరహాలో ఏక్ పోలీసు విధానం టీజీఎస్పీ కానిస్టేబుళ్లు కోరుతున్నారు. ఏక్ పోలీసు విధానం తెస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని అదే అమలు చేయాలని కానిస్టేబుళ్లు కోరారు.


ఆర్డర్లీ వ్యవస్థపై విమర్శలు...

అయితే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఆర్డర్లీ వ్యవస్థపై ఎప్పటి నుంచో అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆర్డర్లీ పేరుతో సీఐలు నుంచి డీజీపీల వరకు తమ సొంత పనులు చేయించుకుంటారని ఆరోపణలు ఉన్నాయి. ఇళ్లలో పాచిపనులు చేయడం, గార్డెనింగ్ చేయడం, వంట పని, అధికారుల పిల్లల్ని ఆడించడం, స్కూళ్లకు తీసుకెళ్లడం, వంటి పనులకు పరిమితం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే శాంతి భద్రతలను అదుపు చేయడం, అదనపు సిబ్బంది అవసరమైన సమయాల్లో వాడుకోడానికి టీజీఎస్పీ సిబ్బంది సేవలను వాడుకోకుండా సొంత సేవలకు వాడుకోవడంపై కిందస్థాయి సిబ్బందిలోనూ అసంతృప్తి ఉంది.


హైదరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం

cv-anand.jpg

తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ) సిబ్బంది ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్‌ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో నెల రోజులపాటు బీఎన్‌ఎస్‌ 163 సెక్షన్‌ (గతంలో 144 సెక్షన్‌)ను విధిస్తూ హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అక్టోబర్ 28న ఆదేశాలు జారీ చేశారు. సిటీ కమిషనరేట్‌ పరిధిలో ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లపై నిషేదం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆదేశాలు నవంబరు 28వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.


టీజీఎస్పీ సిబ్బందితో దర్బార్‌లు..

tgsp.jpg

మరోవైపు టీజీఎస్పీ సిబ్బంది సెలవుల పునర్వవస్థీకరణపై ఇచ్చిన సర్య్కులర్‌ను తాత్కాలికంగా వెనక్కి తీసుకున్న పోలీసులు అధికారులు.. బెటాలియన్లలో దర్బార్‌లు నిర్వహిస్తూ సిబ్బంది సమస్యలను అధికారులు విన్నారు. యూనిఫాం సర్వీస్‌లో ఉండి నిరసనలు చేయవద్దని చెబుతూ.. నిబంధనలు అతిక్రమిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తున్నారు. అధికారులు చేపట్టిన ప్రయత్నాలు ఫలించడంతో ఇప్పటికే కొందరు నిరసనలు వీడి రోజువారీ విధుల్లో పాల్గొనగా.. మరికొందరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.


ప్రభుత్వం కీలక నిర్ణయం

telangana-govt.jpg

అలాగే తెలంగాణ ప్ర్యతేక పోలీసులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో సచివాలయ భద్రత విషయంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ వద్ద భద్రత విధుల నుంచి తెలంగాణ స్పెషల్ పోలీస్‌ను తప్పిస్తూ.. ఆ భద్రతను స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(TGSPF) చేతికి అప్పగించింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద కూడా టీజీఎస్పీ పోలీసులను విధుల నుంచి తప్పించారు.


మరిన్ని Year Ender - 2024 వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి...

ఈ పొలిటికల్ స్టార్‌కు బాగా కలిసొచ్చిన కాలం

కేటీఆర్‌కు ఈడీ ఊహించని షాక్..

Read Latest Telangana News And Teugu news

Updated Date - Dec 28 , 2024 | 10:24 AM