Tirupati Stampede: తిరుపతి ఘటన.. ఏం జరిగిందో చెప్పిన ఏపీ మంత్రి
ABN , Publish Date - Jan 10 , 2025 | 02:00 PM
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటన బాధాకరమన్నారు. విషయం తెలిసిన వెంటనే తనతో పాటు సహచర మంత్రులందరం కలిసి తిరుపతి చేరుకుని మృతుల కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూశామన్నారు. మృతుల్లో నలుగురు ఏపీ, ఒకరు తమిళనాడు, మరొకరు కేరళాకు చెందినవారు ఉన్నారని తెలిపారు.
నెల్లూరు, జనవరి 10: రాష్ట్ర ప్రజలందరికీ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Minister Anam Ramanarayana Reddy) ముక్కోటి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలోని అన్ని వైష్ణవ దేవాలయాల్లో పండుగ ఘనంగా జరుగుతోందన్నారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా బాధకరమన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) బాధని వ్యక్తం చేశారని అన్నారు. సీఎం చంద్రబాబు రూ.2లక్షల కోట్లకుపైగా నిధులు సాధించి, అభివృద్ధిని ఆరంభించారని.. కానీ అందరూ ఆనందంగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటన బాధాకరమన్నారు. విషయం తెలిసిన వెంటనే తనతో పాటు సహచర మంత్రులందరం కలిసి తిరుపతి చేరుకుని మృతుల కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూశామన్నారు. మృతుల్లో నలుగురు ఏపీ, ఒకరు తమిళనాడు, మరొకరు కేరళాకు చెందినవారు ఉన్నారని తెలిపారు. అలాగే గాయపడిన 35 మంది స్విమ్స్‌కు తరలించి చికిత్స అందజేశారని తెలిపారు.
ఇదే జరిగింది...
ఓ మహిళ అస్వస్థతకు గురికావడంతో ఆవిడను తీసుకొచ్చే క్రమంలో ఒక గేటును తెరవబోయి.. మరోగేటును తెరవడంతో భక్తులు ఒకేసారి దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు క్షతగాత్రులు చెప్పారన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో డీఎస్పీ స్థాయి అధికారి అక్కడ లేరని అన్నారు. వైకుంఠ ద్వార టోకెన్ల కోసం తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లను ఏర్పాటు చేశారన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ జరగలేదన్నారు. గత ప్రభుత్వ ఆనవాయితీలను ఎందుకు అనుసరించారని సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారని తెలిపారు. గాయపడిన వారిని సీఎం పరామర్శించారని.. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారన్నారు. అలాగే... మృతుల కుటంబాలకు రూ.25 లక్షల చెప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారన్నారు. గాయాలైన వారు స్వామి దర్శనం చేసుకుని వెళతామని చెప్పడం సీఎంను కదిలించిందని.. అందుకే వారిని.. వారితో పాటు వచ్చిన వారందరికీ స్వామి దర్శన ఏర్పాట్లు చేయమని ఆదేశించారన్నారు. ఘటన పట్ల అందరూ చింతిస్తూ.. అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని.. సలహాలు ఇవ్వాలని కోరామన్నారు.
అహంకార దర్పంతో...
అయితే ప్రతిపక్ష పార్టీ హోదా లేని మాజీ సీఎం జగన్ పరామర్శకు వచ్చినప్పుడు ఆసుపత్రిలో అహంకార దర్పాణ్ని ప్రదర్శించారని మండిపడ్డారు. నేతలు, కార్యకర్తలను వందల సంఖ్యలో వెంట పెట్టుకుని లోనికి వెళ్లారన్నారు. డాక్టర్లు వారిస్తున్నా వినలేదని.. ఐసీయూ నిబంధనలు ఏమిటో జగన్‌కు తెలియదా అని మంత్రి ప్రశ్నించారు. సీఎం కంటే అధికంగా జగన్‌కు భద్రత ఏర్పాటు చేశారని... నేతలు, కార్యకర్తలు.. డాక్టర్లు, సిబ్బందిని నెట్టుకుంటూ వెళ్లారని... పేషెంట్లకు పెట్టిన సెలైన్లు, స్టాండ్లు తోసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జగన్ వచ్చిన సమయంలో 18 మంది ఉన్నారు. జగన్‌కు దుష్టచతుష్ఠయం టీం ఉంది. ఆ నలుగురే టీటీడీని భ్రష్టుపట్టించారు. వారిలో ఒకరు 18 మందికి కవర్లు ఇచ్చి... ప్రభుత్వం, టీడీపీ, సీఎంపై విమర్శలు చేయమన్నారు. సీసీ కెమెరాల్లో తెల్లకవర్లు ఇచ్చిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఏమి సంస్కృతి మీది?... మృగాల మధ్య బతకాల్సిన వారు జనంలో తిరుగుతున్నారు. శవాల మీద పేలాలు ఏరుకోవడానికి తయారయ్యారు. సమాజానికి దూరంగా ఉండమని ప్రజలు బుద్ది చెప్పినా... ఇంకా బుద్ది రాలేదు’’ అంటూ మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆధ్యాత్మిక చింతనే పరమావధిగా..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాలయాల్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. వైసీపీ నేతలకు సనాతన ధర్మం తెలియదని... ఆగమ శాస్త్ర నిబంధనలని పాటించిన పాపన పోలేదన్నారు. వేదపండితులను మరిచిపోయారని... నిగమ, అగమ సంప్రదాయాలు మరిచిపోయారని.. మేకవన్నె పులులు మాదిరిగా తయారయ్యారని వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దేవాదాయశాఖ అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఆధ్యాత్మక చింతనే పరమావధిగా, అన్ని ఆలయాల్లో పూజాధి కార్యక్రమాలతో సహా అన్నీ పండితుల నిర్ణయం ప్రకారమే జరగాలని ఆదేశించిందన్నారు. మైకు సెట్లలో భగవంతుడి నామస్మరణ జరిగేలా చూస్తున్నామన్నారు. నవరాత్రి ఉత్సవాలనిు అత్యంత వైభవంగా జరిపామని.. కనకదుర్గాదేవి ఆలయంలో మూలా నక్షత్రం రోజున సీఎం కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారన్నారు. భక్తులందరికీ మినరల్ వాటర్, ఆహారం అందించామని.. భక్తులందరికీ దర్శనం అందేలా చూశామని తెలిపారు. కన్యకాపరమేశ్వరికి ప్రభుత్వమే చీరాసారెలు అందించాలని ఆదేశిలిచ్చామన్నారు.
నరం లేని నాలుక తీరున జగన్ వ్యాఖ్యలు..
ఆదాయం తక్కువ ఉండే 50 వేల ఆలయాలకు దూపదీప నైవేద్యాల కోసం నెలకు రూ.10 వేలు ఇస్తున్నామని... 6 వేల మంది యువ వేదపండితులకు రూ.3వేలు చొప్పున ఇస్తున్నామన్నారు. ఆలయాల్లో త్వరలోనే వేదపండితులను నియమిస్తామని వెల్లడించారు. ఆలయ కమిటీల్లో బ్రాహ్మణ, నాయిబ్రాహ్మణలకు ఖచ్చితంగా అవకాశమివ్వాలని ఆదేశించామన్నారు. ప్రభుత్వ ఆలయాల్లో అర్చకుల గౌరవ వేతనం రూ.10 వేలు నుంచి రూ.15 వేలుకు పెంచామని.. ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత పెంచామన్నారు. తిరుపతి ఘటనపై విచారణ వేగవంతంగా సాగుతోందన్నారు. ప్రతిపక్ష నాయకుడు నరం లేని నాలుక తీరున మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘నెయ్యి గురించి మాట్లాడుతున్నారు.. ప్రసాదాలని భ్రష్టుపట్టించిందే జగన్. మేము నెయ్యి వ్యవహారాన్ని బయటపెట్టాం. ప్రసాదాలు, అన్నప్రసాదాలు బాగున్నాయని భక్తులు స్వయానా సీఎంకి చెప్పడం సహించలేకున్నారు. దుష్టచతుష్టయంలో ఒక్కొక్కరికీ ఒక్కో చరిత్ర ఉంది. మా ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి మీకెప్పుడూ రాదు, రానివ్వం కూడా’’ అని మంత్రి ఆనంరామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
AP Highcourt: రఘురామ కేసులో ప్రభావతికి హైకోర్టు షాక్
AP Police: పిఠాపురం జనసేన సభలో పోలీసుల ఓవరాక్షన్
Read Latest AP News And Telugu news