Golden Visa: గోల్డెన్ వీసాదారులకు మరో గోల్డెన్ చాన్స్.. ఇకపై పేరెంట్స్‌కి కూడా..

ABN , First Publish Date - 2022-11-15T09:18:36+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని (United Arab Emirates) గోల్డెన్ వీసాదారులకు (Golden Visa holders) మరో గోల్డెన్ చాన్స్. ఇప్పుడు వారి పేరెంట్స్‌కు పదేళ్ల రెసిడెన్సీ కోసం వారు స్పాన్సర్ (Sponsor) చేయవచ్చు.

Golden Visa: గోల్డెన్ వీసాదారులకు మరో గోల్డెన్ చాన్స్.. ఇకపై పేరెంట్స్‌కి కూడా..

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని (United Arab Emirates) గోల్డెన్ వీసాదారులకు (Golden Visa holders) మరో గోల్డెన్ చాన్స్. ఇప్పుడు వారి పేరెంట్స్‌కు పదేళ్ల రెసిడెన్సీ కోసం వారు స్పాన్సర్ (Sponsor) చేయవచ్చు. అక్టోబర్ 3వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన గోల్డెన్ వీసా పథకంలో(Golden Visa Scheme) దీన్ని ఒక భాగంగా చేర్చారు. ఈ నేపథ్యంలో అరేబియన్ బిజినెస్ సెంటర్‌లో ఆపరేషన్ మేనేజర్ ఫిరోసేఖాన్ సంబంధిత వివరాలను వెల్లడించారు. ఒక ప్రవాస ఉద్యోగి సంబంధిత ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ నిర్ధేశించిన విధంగా ప్రతి పేరెంట్‌కి గ్యారెంటీగా డిపాజిట్ చెల్లించడం ద్వారా ఒక ఏడాది పాటు తల్లిదండ్రులను (Parents) స్పాన్సర్ చేయవచ్చన్నారు. గోల్డెన్ వీసాదారులకు చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చారని, వారి సంబంధిత కాన్సులేట్‌లు జారీ చేసిన ప్రామాణిక పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని ఫిరోసేఖాన్ తెలిపారు.

సాధారణంగా అయితే యూఏఈ రెసిడెన్సీ వీసాదారులు కనీసం 20వేల దిర్హమ్స్(రూ.4.41లక్షలు) నెలవారీ జీతం పొందినట్లయితే పేరెంట్స్‌కు స్పాన్సర్ చేయవచ్చని స్పష్టం చేశారు. అయితే, ఈ శాలరీ నిబంధనలు గోల్డెన్ వీసాదారులకు వర్తించవని తెలిపారు. ఇక అర్హులైన నివాసితులకు మొదటిసారిగా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు లక్షలాది గోల్డెన్ వీసాలు జారీ చేయబడ్డాయి. 10 సంవత్సరాల వీసా ధర 2,800 దిర్హమ్స్(రూ.61,753) నుంచి 3,800 దిర్హమ్స్(రూ.83,808) మధ్య ఉంటుంది.

గోల్డెన్ వీసా పథకానికి సవరణలు..

కొత్త రెసిడెన్సీ, విజిట్ వీసా విధానం అక్టోబర్ 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇది కొత్త రెసిడెన్సీ ట్రాక్స్, ఎంట్రీ పర్మిట్‌లను ప్రవేశపెట్టింది. అలాగే ఇప్పటికే ఉన్న ఎంపికల విధానాన్ని కూడా సరళీకృతం చేసింది. ఇక వీసా పథకాల సవరణలలో గోల్డెన్ వీసా స్కీమ్ కూడా ఉంది. తాజాగా ఈ వీసాకు చేసిన సవరణల కారణంగా గోల్డెన్ వీసాదారులకు పలు వెసులుబాటు కలిగాయి. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే.. గోల్డెన్ వీసాదారులు 6నెలలకు పైగా యూఏఈ(UAE) వెలుపల ఉన్న కూడా వారి రెసిడెన్సీ చెల్లుబాటుపై ఎలాంటి ప్రభావం ఉండదు. అలాగే గోల్డెన్ వీసా ఉన్నవారు ఎలాంటి వయోపరిమితి లేకుండా పిల్లలకు స్పాన్సర్ చేయవచ్చు. దీంతో పాటు వారు స్పాన్సర్ చేయగల సహాయక సిబ్బంది సంఖ్యపై కూడా ఎలాంటి పరిమితి లేదు.

ఇదిలాఉంటే.. విదేశీ నిపుణులకు ఆకర్షించేందుకు యూఏఈ నైపుణ్యం కలిగిన ఎక్కువ మందికి ఇప్పుడు దీర్ఘకాలిక రెసిడెన్సీని పొందే వెసులుబాటు కల్పించింది. కనీస నెలవారీ జీతం 50వేల దిర్హమ్స్(రూ.11లక్షలు) నుండి 30వేల దిర్హమ్స్(రూ.6.61లక్షలు) ఉంటే సరిపోతుంది. ఇక ఈ వీసాలను వైద్యం, ఇంజనీరింగ్, సమాచార సాంకేతికత, వ్యాపారం, పరిపాలన, విద్య, చట్టం, సంస్కృతి, సామాజిక విభాగాలకు చెందిన నిపుణులు పొందవచ్చు. కాగా, దరఖాస్తుదారులు యూఏఈలో చెల్లుబాటయ్యే ఉద్యోగ ఒప్పందాన్ని కలిగి ఉండడం తప్పనిసరి.

Updated Date - 2022-11-15T09:37:49+05:30 IST