CM KCR : డిసెంబరు 1 నుంచి ప్రజల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్
ABN , First Publish Date - 2022-11-27T03:06:27+05:30 IST
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడి డిసెంబరుకు నాలుగేళ్లు పూర్తికానుంది! ఆ తర్వాత ఇక ఎన్నికల ఏడాదే! రాష్ట్రంలో ఇప్పటికే రసకందాయంలో పడిన రాజకీయ వేడి ఈ ఏడాది ..
వివిధ జిల్లాల్లో కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు
అక్కడే బహిరంగ సభలు.. భారీగా జన సమీకరణ
కేంద్రం వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడి డిసెంబరుకు నాలుగేళ్లు పూర్తికానుంది! ఆ తర్వాత ఇక ఎన్నికల ఏడాదే! రాష్ట్రంలో ఇప్పటికే రసకందాయంలో పడిన రాజకీయ వేడి ఈ ఏడాది కాలంలో తారస్థాయికి చేరనుంది. ఈ నేపథ్యంలోనే, ఇప్పటికే ప్రకటించినట్లు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం.. అక్కడే భారీ బహిరంగ సభలు నిర్వహించడం.. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని; ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టాలని భావిస్తున్నారు. డిసెంబరు ఒకటో తేదీ నుంచే ఇందుకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా, వివిధ జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ సముదాయాలను ప్రారంభించనున్నారు. డిసెంబరు ఒకటో తేదీన మహబూబాబాద్, 4న మహబూబ్‌నగర్, 7 లేదా 8న జగిత్యాల, ఆ తర్వాత ఇదే నెలలో మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా, ఆయా జిల్లా కేంద్రాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించాలని భావిస్తున్నారు. అలాగే, రాష్ట్రం దాదాపు రూ.40 వేల కోట్ల అప్పు తీసుకోకుండా కేంద్రం అడ్డు పడిందని, ఈ విషయమై శాసనసభ వేదికగా సమరం చేయాలని నిర్ణయించిన కేసీఆర్.. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇక, మొయినాబాద్ ఫాంహౌ్‌సలో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ పెద్దలు అనుసరించిన రీతిని కూడా ప్రజలకు మరోసారి వివరించాలని భావిస్తున్నారు. జిల్లాల పర్యటనలో మరింత దూకుడుగా బీజేపీపై విరుచుకుపడాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం.