CM KCR : దాడులను సహించం!
ABN , First Publish Date - 2022-11-23T03:46:46+05:30 IST
ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) శ్రీనివాసరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
దోషులకు కఠిన శిక్షపడేలా చర్యలుంటాయి
ఎఫ్ఆర్వో మృతిపట్ల కేసీఆర్ దిగ్ర్భాంతి
మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం
ఉద్యోగులకు అండదండలుంటాయని భరోసా
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) శ్రీనివాసరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి దోషులకు కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. ఈ దిశగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆయన ఆదేశించారు. అటవీశాఖ అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. శ్రీనివాసరావు ఉద్యోగంలో ఉంటే నిబంధనల ప్రకారం ఎలాంటి జీతభత్యాలు అందుతాయో అన్నీ కూడా ఉద్యోగ విరమణ వయసు దాకా అందేలా చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎలాంటి జంకు లేకుండా తమ విధులను నిర్వర్తించాలని భరోసా ఇచ్చారు. శ్రీనివాసరావు పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఎఫ్ఆర్వో అంత్యక్రియల్లో పాల్గొని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని మంత్రులను ఆదేశించారు.
ఆక్రమణ దారులపై కఠిన చర్యలు: ఇంద్రకరణ్
శ్రీనివాసరావు మృతి పట్ల అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే, విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేయడం సరికాదన్నారు. అడవుల ఆక్రమణలను సహించేది లేదని, ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అటవీ అధికారులు మనోస్థయిర్యాన్ని కోల్పోవద్దని అన్నారు. ఎఫ్ఆర్వో మృతిపట్ల మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్వో మృతి పట్ల అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) డోబ్రియాల్ తీవ్ర సంతాపం తెలియజేశారు. దాడి ఘటనకు తెలంగాణ అటవీ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఇలాంటి దాడులకు భయపడబోమని, ప్రభుత్వం సహకారంతో అటవీ భూములను కాపాడుకుంటామని పేర్కొంది.