Tomatoes: దిక్కుతోచని స్థితిలో టమోటా రైతులు.. పాపం.. రోడ్డు పక్కన పారేసి పోతున్నారు !

ABN , First Publish Date - 2023-09-08T15:41:06+05:30 IST

నిన్నటి దాకా టమోటా ధరలు ఆకాశాన్నంటాయి. 15 కిలోల ట్రే గరిష్ఠంగా రూ.2600 వరకు పలికింది. దీంతో కూరల్లోకి అర కేజీ కూడా కొనలేని పరిస్థితి. ఈ ధరలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరిచేశాయి. రైతులైతే ఆనందం పట్టలేకపోయారు. లాటరీ తగిలినట్టుగా ఫీలయ్యారు. అయితే రెండు వారాలు తిరక్కుండానే మొత్తం పరిస్థితి పూర్తి వ్యతిరేకంగా మారింది.

Tomatoes: దిక్కుతోచని స్థితిలో టమోటా రైతులు.. పాపం.. రోడ్డు పక్కన పారేసి పోతున్నారు !

టమోటా ధరల పతనం

15 కిలోల బాక్సు రూ.40

ధర తగ్గుదలకు తోడయిన వర్షం దెబ్బ

దిక్కుతోచని స్థితిలో టమోటా రైతులు

మద్దతు ధర ఇవ్వడమే పరిష్కారం

నిన్నటి దాకా టమోటా ధరలు ఆకాశాన్నంటాయి. 15 కిలోల ట్రే గరిష్ఠంగా రూ.2600 వరకు పలికింది. దీంతో కూరల్లోకి అర కేజీ కూడా కొనలేని పరిస్థితి. ఈ ధరలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరిచేశాయి. రైతులైతే ఆనందం పట్టలేకపోయారు. లాటరీ తగిలినట్టుగా ఫీలయ్యారు. అయితే రెండు వారాలు తిరక్కుండానే మొత్తం పరిస్థితి పూర్తి వ్యతిరేకంగా మారింది. మార్కెట్‌ మాయాజాలం మొదలైంది. ధరలు నింగి నుంచి నేలకు పడిపోయాయి. ప్రస్తుతం ట్రే రూ.40 నుంచి రూ.60 మధ్య పలుకుతోంది. కోత కూలి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు వాటిని కక్కలపల్లి గ్రామ రోడ్డు పక్కన పారేసి పోతున్నారు. ధరలు పెరిగినప్పుడు లాభపడింది కొద్ది మంది మాత్రమే. ప్రస్తుతం టమోటా రైతులందరూ విలపిస్తున్నారు. ఏమిటీ ఈ మార్కెట్‌ మాయాజాలం? దీనికి అడ్డుకట్ట వేయలేమా?

అనంతపురం రూరల్‌ మండలం కాట్నేకాలువకు చెందిన ఓ రైతు 15 ఎకరాల్లో టమోటా సాగు చేశాడు. కట్టెలతో పంట సాగు చేశాడు. ఎకరం రూ.1.30 లక్షల పంట సాగుకే ఖర్చు చేశాడు. దిగుబడులు ఆశాజనకంగానే వస్తున్నాయి. అయితే ధరలు పడిపోవడంతో ఆ కష్టం ఎందుకూ పనికిరాకుండా పోయింది. గురువారం ఆరు లాట్ల టమోటాను స్థానిక మార్కెట్‌కు తీసుకువెళ్లితే అందులో మూడు లాట్లు రూ.40 నుంచి రూ.50 మధ్య అమ్ముడుపోయాయి. మూడు లాట్లు నో సేల్‌ కింద పెట్టేశారు. దీంతో ఆ రైతు కాయలను మార్కెట్‌లోనే వదిలి వెళ్లిపోయాడు. ఇలాంటి పరిస్థితి ప్రతి మండీలో ఉండటం గమనార్హం.

(అనంతపురం రూరల్‌)

ఈ సీజన్‌ ఆరంభంలో టమోటా ధర ఆకాశాన్ని అంటింది. కిలో రూ.150 నుంచి రూ.200 వరకు పలికింది. క్రమేణా ధరలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు పతనస్థాయికి చేరింది. ఈక్రమంలోనే కొంత మంది రైతులు, మండిల యజమానులు టమోటాలను పారబోస్తున్నారు. ప్రస్తుతం కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో 15కిలోల ట్రే రూ.40 నుంచి రూ.60 మధ్య పలుకుతోంది. దీంతో సంబంధిత రైతులు దిగులు చెందుతున్నారు. ధరలు పడిపోవడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మార్కెట్‌లో టమోటా ధర డౌన్‌ కావడమే కాకుండా ఇటీవల కురిసిన రెండు రోజుల వర్షంతో మరింత దెబ్బతిన్నట్లు ఆయా వర్గాల సభ్యులు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ పతనమవుతున్న టమోటా ధర ఆ రైతుల గుండెల్లో మరింత ఆందోళనను రేకితిస్తోంది.


మార్కెట్‌కు నాలుగువేల టన్నులకు పైగా ఉత్పత్తులు

జిల్లాలో 12వేల హెక్టార్లలో టమోటా పంట సాగులో ఉన్నట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో దాదాపు 8వేల ఎకరాలు దిగుబడి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో నాలుగువేల ఎకరాలు వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఈక్రమంలోనే మార్కెట్‌కు రోజువారీగా నాలుగు వేల టన్నులకుపైగా ఉత్పత్తులు మార్కెట్‌కు రావడం జరుగుతోంది. ఉత్పత్తులు ఎక్కువైపోవడమే ధరలు తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది. దీనికితోడు ఇటీవల కురిసిన వర్షాలు వలన కూడా ధరలు మరింత తగ్గిపోయే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సభ్యులు చెప్పుకొస్తున్నారు. ఇదే జరిగితే రైతులు ఆర్థిక నష్టాల్లోకి కూరుకుపోవడం ఖాయమన్న అభిప్రాయాలు అన్నదాతల నుంచి వ్యక్తమవుతున్నాయి.

పారబోత దిశగా..

కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో సీజన్‌ ప్రారంభంలో 15కిలోలా ట్రే రూ.2400 నుంచి రూ.2600 వరకు పలికాయి. అప్పట్లో కొంత మంది మండీల యజమానులు ఇతరమార్కెట్‌ల నుంచి కాయలను తెప్పించుకుని మరీ వేలం పెట్టారు. అయితే ప్రస్తుతం టమోటా ఉత్పత్తులు భారీ పెరిగిపోయాయి. ఒక్కొక్క మండీకి వేల బాక్సులు టమోటా ఉత్పత్తులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ధరలు భారీగా పడిపోయాయి. స్థానిక మార్కెట్‌తోపాటు ఇతర మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి తోడు రెండు కిందట వరకు కురిసిన వర్షాలకు పంట కొంత దెబ్బతిన్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నారు. నీరుకాయలు వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో వాటి కొనుగోలుకు బయ్యార్లు ముందుకు రావడంలేదన్న వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఉత్పత్తులను నో సేల్‌ కిందపడిపోయాయి. వివిధ కారణాల పేరుతో స్థానిక మార్కెట్‌లో నోసేల్‌ కింద దాదాపు 50శాతం వరకు పెట్టేసినట్లు ఆయా వర్గాల సభ్యులు చెప్పుకొస్తున్నారు. మార్కెట్‌కు తీసుకొచ్చిన కాయలను తిరిగి తీసుకువెళ్లలేక.. వాటిని అలానే మండీల్లో వదిలి వెల్లిపోతున్నారు. మరికొందరు మార్కెట్‌కు తీసుకువెళ్లలేక పారబోస్తున్నారు. రైతులు వదిలి వెళ్లిన కాయలను మండీల యజమానులు హైవే, మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో పారబోస్తున్నారు. ఆ ప్రాంతాలన్నీ టమోటా దిబ్బలతో దర్శనమిస్తున్నాయి. వాటిని చూస్తే రైతుల కష్టం ఏమౌతుందో అర్థం అవుతుంది.

కూలి ఖర్చులు కూడా రావు..

ఎకరంలో టమోటా సాగు చేశాను. నాలుగో కట్టింగ్‌ పడింది. 80 బాక్సులు అయితే మార్కెట్‌కు తెచ్చా. ఇక్కడ చూస్తే బాక్సు రూ.40తో అమ్ముడుపోయాయి. బాక్సులు మార్కెట్‌కు తీసుకొచ్చేందుకే రూ.1500 బాడుగ అయింది. కమీషన్‌, ఇతరాత్రా అన్నీ పోతే మిగిలిందంటూ ఏమి ఉండడం లేదు. ఈ ధరలతో చివరికి పంట కోత కొచ్చే కూలీల ఖర్చు కూడా రావడం కష్టమే.

- మల్లన్న,రైతు కొత్తపల్లి, ఆత్మకూరు మండలం

ధర్మవరం మండలం గరుడంపల్లి సమీపంలో రోడ్డు పక్కన పారబోసిన టమోటాలు

ధర్మవరం మండలం గరుడంపల్లి సమీపంలో కొందరు రైతులు టమోటాలను రోడ్డు పక్కన పారబోశారు. మార్కెట్‌లో 15 కేజీల బాక్సు ధర రూ.50 నుంచి రూ.70 వరకు మాత్రమే పలుకుతోంది. అమ్మకానికి తీసుకువెళితే వాహనం బాడుగ కూడా రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల క్రితం 15 కేజీల బాక్సు రూ.2 వేల వరకు పలికింది. ఇప్పుడు అమాంతం పడిపోయింది. పంట చేతికొచ్చే సమయంలో ఇలా ధరలు పడిపోవడం రైతులు కంటతడి పెడుతున్నారు.

- ధర్మవరం రూరల్‌

కష్టమే మిగులుతోంది

నేను రెండు ఎకరాల్లో టమోటా సాగు చేశా. రూ.80వేల వరకు పెట్టుబడుల రూపంలో వచ్చింది. మూడో కట్టింగ్‌ పడింది. 160బాక్సులు అయ్యాయి. 9మందికి ఒక్కొక్కరికి రూ.300లు కూలీ ఖర్చు అవుతోంది. రవాణా చార్జీలు ఇతరాత్రావాటికి ఒక్కొక్క బాక్సుకు రూ.25వరకు ఖర్చు అవుతోంది. ఇన్ని కష్టాలు పడి మార్కెట్‌కొస్తే ఇక్కడేమో బాక్సు రూ.40తో అమ్ముడుపోతోంది. మొదటి సారి రూ.130, రెండవసారి రూ.150తో అమ్ముడుపోయాయి. ధరలు చూస్తే రోజు రోజుకు పడిపోతున్నాయి. ఇలా అయితే రైతులకు కష్టమే మిగులుతోంది.

- భాస్కర్‌, రైతు, ఓబుళాపురం, కళ్యాణదుర్గం మండలం

నీరుకాయలు వస్తున్నాయి

మండీలకు కాయలు పెరిగిపోయాయి. దీంతో ధర డౌన్‌ అయింది. అంతే కాకుండా వర్షానికి కాయలు దెబ్బతిన్నాయి. నీరుకాయలు పడ్డాయి. దూరప్రాంతాలకు వాటిని రవాణా చేయలేని పరిస్థితి. అంతే కాకుండా వాటిని కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదు.

- కదిరప్ప,యజమాని, ఎస్‌ఎల్‌వీ మండీ

ఎలా అధిగమించాలి

ఇటువంటి సంక్షోభ సమయంలో రైతు సంక్షేమం కోసమే తాము ఉన్నామని చెప్పే రాజకీయపక్షాలు మౌనం దాల్చడం బాధాకరం. ఇతర పంటలకు మద్దతు ధర అమలు చేసినట్టుగా టమోటాకు కూడా కనీసం బాక్సుకు రూ. 100 మద్దతుధరను అమలుచేయాల్సిఉంది. రైతుసంఘాలు, కమ్యూనిస్టు వీరులు ఆ దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావలసిన అవసరముంది. కలెక్టర్‌ కూడా జోక్యం చేసుకుని ప్రాసెసింగ్‌ ప్లాంటు ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవలసిన అవసరముంది.

Updated Date - 2023-09-08T15:41:25+05:30 IST