Jobs News: నిరుద్యోగులకు శుభవార్త.. SBIలో 2వేల పీవో పోస్టులకు నోటిఫికేషన్

ABN , First Publish Date - 2023-09-07T14:13:16+05:30 IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా 2వేల పీవో పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు ప్రకటించింది. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 7 నుంచే ప్రారంభమైందని తెలిపింది. అర్హులైన అభ్యర్థులు తమ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా ఈనెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది.

Jobs News: నిరుద్యోగులకు శుభవార్త.. SBIలో 2వేల పీవో పోస్టులకు నోటిఫికేషన్

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త అందించింది. 2వేల పీవో పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు ప్రకటించింది. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 7 నుంచే ప్రారంభమైందని తెలిపింది. అర్హులైన అభ్యర్థులు తమ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా ఈనెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. 2వేల ప్రొబిషనరీ ఆఫీసర్ పోస్టులలో ఓబీసీలకు 540 పోస్టులు కేటాయించగా.. ఎస్సీలకు 300, ఎస్టీలకు 150, ఈడబ్ల్యూఎస్‌లకు 200, యూఆర్‌లకు 810 చొప్పున కేటాయించారు.

ఎస్‌బీఐ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ప్రొబిషనరీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస అర్హతగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ప్రభుత్వ సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ పరీక్షలు రాసేవాళ్లు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థుల కనీస వయసు ఏప్రిల్ 1, 2023 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ లేదాఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు (నాన్‌ క్రిమిలేయర్‌) మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌‌లకు ఐదేళ్లు చొప్పున సడలింపు ఉంటుంది.

అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. కాగా ఎస్‌బీఐలో ప్రొబిషనరీ ఆఫీసర్ల ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. తొలి దశలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారు మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో కూడా అర్హత సాధిస్తే సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. మెరిట్ ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది. నవంబర్‌లో ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. డిసెంబర్‌ లేదా జనవరిలో ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. జనవరి లేదా ఫిబ్రవరిలో సైకోమెట్రిక్‌, ఇంటర్వ్యూ, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ పరీక్షలు ఉంటాయి. ఫిబ్రవరి లేదా మార్చిలో ఫలితాలు విడుదల చేస్తారు. మరిన్ని వివరాలకు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ https://bank.sbi/careers/current-openings ను సందర్శించండి.

Updated Date - 2023-09-09T01:22:52+05:30 IST