Air India Pee Gate: పశ్చాత్తాపం లేకుండా మళ్లీ ఇలాంటి ఆరోపణలా?: శంకర్ మిశ్రాపై బాధితురాలి ఫైర్
ABN , First Publish Date - 2023-01-14T19:21:52+05:30 IST
ఎయిర్ ఇండియా (Air India) విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన (Air India Pee Gate) ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. గతేడాది
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా (Air India) విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన (Air India Pee Gate) ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. గతేడాది నవంబరు 26న న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో శంకర్ మిశ్రా (Shankar Mishra) అనే ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలైన వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. బాధితురాలి ఫిర్యాదుతో ఇటీవల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడు పరారయ్యాడు. బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి అక్కడికెళ్లిన ఢిల్లీ పోలీసులు శంకర్‌ను గత వారం అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
శంకర్‌ను ప్రశ్నించాల్సి ఉందని, తమకు కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిరాకరించడంతో పోలీసులు సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీలుపై కోర్టు మిశ్రాకు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా నిందితుడు కోర్టుకు సమాధానమిస్తూ.. ప్రయాణికురాలిపై తాను మూత్ర విసర్జన చేసినట్టు వచ్చిన వార్తలు నిజం కాదని, ఆవిడే మూత్ర విసర్జన చేసుకుని ఉంటుందని సంచలన ఆరోపణలు చేశాడు. అయితే, ఈ ఘటనలో బాధితురాలికి తాను నష్టపరిహారం కూడా చెల్లించానని, సమస్య ముగిసిపోయిందని గతంలో చెప్పిన మిశ్రా.. ఆ తర్వాత మాట మార్చడంపై బాధితురాలు తీవ్రంగా స్పందించారు.
శంకర్ మిశ్రా ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిందితుడు తన బెయిలు దరఖాస్తులో పేర్కొన్న విషయాలు, కోర్టులో చేసిన వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. తనలాంటి అనుభవం మరొకరికి ఎదురుకాకూడదన్న ఉద్దేశంతోనే తాను ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చారు. తాను చేసిన పనికి పశ్చాత్తాపం చెందాల్సింది పోయి, తనను మరింత వేధించాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.