BJP leader: బీజేపీ నేత సంచలన కామెంట్స్.. అధిష్ఠానం ఆదేశిస్తే ఒక్కరోజులో.. ముగిస్తాం...

ABN , First Publish Date - 2023-09-02T10:42:57+05:30 IST

రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 40-45మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌

BJP leader: బీజేపీ నేత సంచలన కామెంట్స్.. అధిష్ఠానం ఆదేశిస్తే ఒక్కరోజులో.. ముగిస్తాం...

- 40-45 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు

- పార్టీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే ఒకే రోజు ఆపరేషన్‌

- బీజేపీ జాతీయ సంఘటనా కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ సంచలన వ్యాఖ్యలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 40-45మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే ఒకేరోజు ఆపరేషన్‌ ముగించేస్తామని బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేసింది. బెంగళూరులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఏర్పాటైన పార్టీ సీనియర్‌ నేతల సమావేశంలో జాతీయ సంఘటనా కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌(BL Santosh) చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆపరేషన్‌ హస్త ప్రయత్నాల నేపథ్యంలోనే బీజేపీ నేత సంతోష్‌ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలై తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్న బీజేపీ శ్రేణుల్లో బీఎల్‌ సంతోష్‌ వ్యాఖ్యలు కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి. బీజేపీని వీడి కాంగ్రెస్‏లో ఎవరూ చేరబోరని స్పష్టం చేసిన సంతోష్‌ లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‏లో ప్రకంపనలు ఖాయమన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మనం 25 స్థానాలను నిలబెట్టుకోగలిగామంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయాలు మలుపులు తిరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. తనతో టచ్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ప్రస్తుతానికి ఆపరేషన్‌ కమలపై తమకు ఆసక్తి లేదని, ఆపరేషన్‌ హస్త ప్రారంభిస్తే మాత్రం అందుకు ధీటుగానే బదులిస్తామని కాంగ్రె్‌సకు వార్నింగ్‌ ఇచ్చేలా వ్యాఖ్యానించారు. ఆశ్చర్యకరంగా బీఎల్‌ సంతోష్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి సొంత పార్టీ చెందిన ఎమ్మెల్యేలు ఎస్‌టీ సోమశేఖర్‌, శివరాం హెబ్బార్‌ గైర్హాజరయ్యారు. మాజీ సీఎం యడియూరప్పకు అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న మాజీ మంత్రి రేణుకాచార్య కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండడం గమనార్హం.

దమ్ముంటే ఆపరేషన్‌ చేయండి: కాంగ్రెస్‌ సవాల్‌

45మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని అధిష్ఠానం ఆదేశిస్తే ఒకరోజులో ‘ఆపరేషన్‌’ పూర్తి చేసేస్తామంటూ బీఎల్‌ సంతోష్‌(BL Santosh) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఘాటుగా స్పందించింది. హోం మంత్రి డాక్టర్‌ జీ పరమేశ్వర్‌ బెంగళూరులో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ శాసనసభకు ఎన్నికలు జరిగి నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకు ప్రతిపక్షనేతలను ఎన్నుకోలేని దుస్థితిలో ఉన్న బీజేపీ ఆపరేషన్‌ మొదలుపెడితే ఏం జరుగుతుందో చూద్దాం అంటూ ఛ లోక్తి విసిరారు. మరికొద్ది రోజులు ఆగితే ఎవరితో ఎవరు టచ్‌లో ఉన్నారో తెలుస్తుందంటూ చురకలంటించారు.

pandu1.jpg

శతాబ్దపు అతిపెద్ద జోక్‌...

బీఎల్‌ సంతోష్‏కు సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే పట్టు లేదని, పైగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్‌ అని కేపీసీసీ(KPCC) వ్యాఖ్యానించింది. ఈమేరకు శుక్రవారం ట్వీట్‌ చేసింది. యడియూరప్ప పార్టీలో అలంకార ప్రాయంగా మారారని, ఆయనను నమ్ముకుని బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలంతా తమ భవిష్యత్తు గురించి దిగాలుగా ఉన్నారని కాంగ్రెస్‌ ట్వీట్‌లో పేర్కొంది. అసంతృప్త ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే సంతోష్‌ ప్రగల్బాలు పలుకుతున్నారని పేర్కొంది. బీజేపీలా కాంగ్రెస్‌ చవకబారు రాజీకీయాలకు తెర తీసే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ సీనియర్‌ నేత రేణుకాచార్య కూడా బీఎల్‌ సం తోష్‌ వ్యాఖ్యలపై స్పందించారు. పార్టీలో ఒక వర్గం సంతోష్‏కు వెన్నుదన్నుగా ఉందని, వాపును బలుపుగా భావించి ఇటీవలి ఎన్నికల్లో దెబ్బతిన్నా ఇంకా జ్ఞానోదయం కాలేదని చురకలు అంటించారు. ఇక ప్రజలే వారికి బుద్ది చెబుతారన్నారు.

ముందు ఎమ్మెల్యేలను కాపాడుకోండి : శెట్టర్‌

ఆపరేషన్‌ కమల సంగతి దేవుడెరుగు. ముందు ఎమ్మెల్యేలు పార్టీనుంచి చేజారిపోకుండా చూసుకోవాలని ఒకప్పటి బీజేపీ నేత, ప్రస్తుత కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జగదీశ్‌ శెట్టర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. కాగా పౌర, ఆహార సరఫరాలశాఖ మంత్రి కేహెచ్‌ మునియప్ప స్పందిస్తూ శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఓటమి షాక్‌ నుంచి బీజేపీ నేతలు ఇంకా కోలుకోలేదని ఎద్దేవా చేశారు. నిరాశ నిస్పృహలతో ఏవేవో మాట్లాడుతున్నారన్నారు.

కుమ్ములాటలు బయటపడ్డాయి: సీఎం

బీజేపీలో కుమ్ములాటలు తారస్థాయికి చేరాయని, ఇవి అందరూ ఊహించిందేనని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) వ్యాఖ్యానించారు. ఈమేరకు ట్వీట్‌ చేసిన ఆయన ఆపరేషన్‌ కమలకు సంబంధించి బీఎల్‌ సంతోష్‌ వ్యాఖ్యలను తాము ఏమాత్రం పట్టించుకోబోమన్నారు. ఒక కాంగ్రెస్‌ ఎమ్మె ల్యే కూడా బీజేపీలో చేరబోరన్నారు. ఇప్పటికే చేరినవారి పరిస్థితి త్రిశంకుస్వర్గంలో మారిందన్నారు. సొంత పార్టీని సరిదిద్దుకోలేని వారు కాంగ్రెస్‌ను విమర్శిం చడం హస్యాస్పదమన్నారు.

Updated Date - 2023-09-02T10:42:59+05:30 IST