Same-sex couples : స్వలింగ జంటల సమస్యల పరిష్కారానికి కమిటీ.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం..

ABN , First Publish Date - 2023-05-03T14:54:11+05:30 IST

స్వలింగ జంటల (Same-sex couples) సమస్యల్లో కొన్నిటి పరిష్కారానికి తీసుకోవలసిన పరిపాలనపరమైన చర్యలను

Same-sex couples : స్వలింగ జంటల సమస్యల పరిష్కారానికి కమిటీ.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం..
Supreme Court

న్యూఢిల్లీ : స్వలింగ జంటల (Same-sex couples) సమస్యల్లో కొన్నిటి పరిష్కారానికి తీసుకోవలసిన పరిపాలనపరమైన చర్యలను గుర్తించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ విషయంలో వచ్చిన సూచన పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. స్వలింగ పెళ్లిళ్లకు చట్టబద్ధ గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (D Y Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

స్వలింగ పెళ్లిళ్లకు చట్టబద్ధ గుర్తింపునివ్వడం గురించి మరింత లోతుల్లోకి వెళ్ళకుండా, స్వలింగ జంటలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల పరిష్కారానికి అమలు చేయవలసిన పరిపాలనపరమైన చర్యలను గుర్తించేందుకు కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీని కోసం చాలా మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం అవసరమని వివరించింది.

కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ విషయంలో ఎలాంటి పరిపాలనపరమైన చర్యలు తీసుకోవచ్చునో పిటిషనర్లు సూచించవచ్చునని తెలిపారు.

ఏప్రిల్ 27న జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఓ పశ్న వేసింది. స్వలింగ పెళ్లిళ్లకు చట్టబద్ధ గుర్తింపు ఇచ్చే విషయంలో మరింత ముందుకు వెళ్ళకుండా, స్వలింగ జంటలకు సాంఘిక సంక్షేమ ప్రయోజనాలను అందజేయడానికిగల అవకాశాలను ఇవ్వడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించింది. స్వలింగ జంటలు కలిసి జీవించే హక్కును ప్రాథమిక హక్కుగా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే, దాని సాంఘిక పర్యవసానాలను గుర్తించవలసిన కర్తవ్యం కూడా ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది.

స్వలింగ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై బుధవారం ఏడో రోజు విచారణ జరిగింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ హిమ కొహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహ ఉన్నారు.

ఇవి కూడా చదవండి :

MeToo Protest : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌పై ఒలింపియన్ వినేష్ ఫోగట్ ఆరోపణలు

Karnataka Polls : కర్ణాటకలో చెట్లకు కరెన్సీ కట్టల పంట.. ఆశ్చర్యపోతున్న ఐటీ అధికారులు..

Updated Date - 2023-05-03T14:54:11+05:30 IST