Oscars Win: మోదీజీ..! ప్లీజ్..!.. ఆస్కార్ క్రెడిట్ మీ ఖాతాలో వేసుకోకండి: ఖర్గే
ABN , First Publish Date - 2023-03-14T18:45:29+05:30 IST
భారతదేశానికి రెండు ఆస్కార్ అవార్డులు రావడంతో యవద్దేశం ఓవైపు సంబరాలు చేసుకుంటుండగా..మరోవైపు రాజ్యసభలోనూ..
న్యూఢిల్లీ: భారతదేశానికి రెండు ఆస్కార్ అవార్డులు (Oscar Awards) రావడంతో యవద్దేశం ఓవైపు సంబరాలు చేసుకుంటుండగా..మరోవైపు రాజ్యసభలోనూ అహ్లాదకర వాతావరణం చోటుచేసుకుంది. ఆస్కార్ విజేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభినందలు తెలియజేస్తూనే, మోదీ సర్కార్‌కు నవ్వుతూ చురకలంటించారు. దీంతో రాజ్యసభలో నవ్వులు విరిసాయి.
'ఆర్ఆర్ఆర్', 'ది ఎలిఫెంట్ విస్పర్స్' డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డులు రావడాన్ని మల్లికార్జున్ ఖర్గే ప్రస్తావిస్తూ, ప్రపంచానికి ఇండియా కంట్రిబ్యూషన్ ఇదని, అయితే రెండు ఆస్కార్ల విజయాన్ని తమ ఖతాలో వేసుకోవద్దని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ''అవార్డు విజేతలకు నా అభినందనలు తెలియజేస్తున్నారు. మనం గర్వించే విషయం ఇది. అయితే ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలోకి వేసుకోవద్దని అధికార పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేమే దర్శకత్వం వహించాం, మేమే రచన చేశాం, మోదీ దర్శకత్వం వహించారని మాత్రం చెప్పొద్దు. ఇదొక్కడే నా విజ్ఞప్తి'' అని ఖర్గే అన్నారు.
ఖర్గే తన ప్రకటన కొనసాగిస్తూ.. "ముఖ్యంగా 'నాటు నాటు'' పాటకు, 'ది ఎలిఫెంట్ విస్పర్స్'కు అవార్డులు రావడం, రెండు సినిమాలు దక్షిణాది నుంచి వచ్చినవి కావడం ఇదే ప్రథమం. ఇది మనందరికి గర్వకారణం. దీనిపై అధికార పార్టీ ఏమి మాట్లాడినా మేము స్వాగతిస్తాం. కానీ, దయచేసి మేమే దర్శకత్వం చేశాం, పాట రాసింది మేమే, మోదీ డైరక్షన్ చేశారంటూ ఆ క్రెడిట్ మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయకండి. అవార్డు క్రెడిట్ దేశానికి చెందుతుంది'' అని అన్నారు. ఖర్గే వ్యాఖ్యలతో సభాధ్యక్షుడి స్థానంలో ఉన్న ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ సహా అధికార పార్టీ ఎంపీలు పెద్దపెట్టున నవ్వుకోవడం కనిపించింది.