Share News

Former Minister: అవినీతి కేసు నుంచి మాజీ మంత్రి విడుదల

ABN , First Publish Date - 2023-11-29T08:34:13+05:30 IST

శ్మశానవాటికల్లో షెడ్ల నిర్మాణం పథకంలో అవినీతి జరిగిందంటూ సీబీఐ దాఖలు చేసిన కేసు నుంచి మాజీ మంత్రి సెల్వగణపతి(Former minister Selvaganapathy)ని

Former Minister: అవినీతి కేసు నుంచి మాజీ మంత్రి విడుదల

ప్యారీస్‌(చెన్నై): శ్మశానవాటికల్లో షెడ్ల నిర్మాణం పథకంలో అవినీతి జరిగిందంటూ సీబీఐ దాఖలు చేసిన కేసు నుంచి మాజీ మంత్రి సెల్వగణపతి(Former minister Selvaganapathy)ని విడుదల చేస్తూ మద్రాసు హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత 1991 నుంచి 1996 వరకు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వంలో, 1995 - 96 సంవత్సరాల మధ్య స్థానిక సంస్థల శాఖ మంత్రిగా టీఎం సెల్వగణపతి వ్యవహరించారు. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 100 శ్మశానవాటికల్లో షెడ్ల నిర్మాణం పథకంలో రూ.23 లక్షలు ప్రభుత్వానికి నష్టం కలిగించారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన చెన్నై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం, సెల్వగణపతి, ఐఏఎస్‌ అధికారులు జేటీ ఆచార్యులు, ఎం.సత్యమూర్తి సహా ఐదుగురికి తలా రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ 2014వ సంవత్సరంలో తీర్పు వెలువరించింది. అదే సమయంలో సామూహిక కుట్ర నేరం నుంచి వీరిని న్యాయస్థానం విడుదల చేసింది. అయితే ఈ తీర్పు వ్యతిరేకిస్తూ సీబీఐ తరఫున, జైలు శిక్ష వ్యతిరేకిస్తూ సెల్వగణపతి బృందం తరఫున మద్రాసు హైకోర్టులో 2014లో అప్పీలు పిటిషన్లు దాఖలయ్యాయి. సీబీఐ తరఫున హాజరైన న్యాయవాదులు... సెల్వగణపతి బృందం కేంద్రప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిందని, 100 శ్మశానవాటికల్లో షెడ్లు నిర్మించేందుకు అనుమతులు జారీచేసి, 96 షెడ్లు మాత్రమే నిర్మించిందని, ఈ అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని వాదించారు. ఇరుతరఫు వాదనలు ఈ నెల 9వ తేదీతో ముగియడంతో తీర్పు తేది ప్రకటించకుండా హైకోర్టు న్యాయమూర్తి జయచంద్రన్‌ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో, సెల్వగణపతి తరఫున దాఖలైన అప్పీలు కేసులకు సంబంధించి న్యాయమూర్తి జయచంద్రన్‌ మంగళవారం తీర్పు వెలువరించారు. అందులో, సెల్వగణపతికి విధించిన రెండేళ్ల జైలుశిక్ష రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రెండేళ్ల జైలుశిక్ష విధించిన కారణంగా సెల్వగణపతి ఎంపీ పదవి కోల్పోవడం గమనార్హం.

Updated Date - 2023-11-29T08:34:15+05:30 IST