Manipur : మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ముగ్గురి మృతి..

ABN , First Publish Date - 2023-08-05T11:36:29+05:30 IST

మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. బిష్ణుపూర్ జిల్లా, క్వాక్టా పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తండ్రీకొడుకులు ఉన్నారు. ఈ తండ్రీకొడుకులిద్దరినీ ఉగ్రవాదులు కాల్చి చంపేసి, ఆ తర్వాత వారి మృతదేహాలను కత్తులతో ముక్కలు చేశారు.

Manipur : మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ముగ్గురి మృతి..

న్యూఢిల్లీ : మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లా, క్వాక్టా పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తండ్రీకొడుకులు ఉన్నారు. ఈ తండ్రీకొడుకులిద్దరినీ ఉగ్రవాదులు కాల్చి చంపేసి, ఆ తర్వాత వారి మృతదేహాలను కత్తులతో ముక్కలు చేశారు.

అత్యంత బాధాకరమైన మరో విషయం ఏమిటంటే, మృతులు ముగ్గురూ శుక్రవారం వరకు సహాయక శిబిరాల్లోనే ఉండేవారు. పరిస్థితి మెరుగుపడిందనే ఉద్దేశంతో వీరు శుక్రవారమే క్వాక్టా పట్టణంలోని తమ నివాసాలకు వెళ్లారు. తండ్రీకొడుకులిద్దరూ నిద్రలో ఉండగా కాల్చి చంపడం అత్యంత అమానుషం. ఈ హత్యాకాండ గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే రోడ్లపైకి వచ్చి, చురాచాంద్‌పూర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ భద్రతా దళాలు వారిని అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్వాక్టా పట్టణం సమీపంలోనూ, ఫౌగక్చావో సమీపంలోనూ భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భారీగా కాల్పులు జరుగుతున్నట్లు తెలిపారు.

ఘర్షణలకు కారణం

మెయిటీ తెగవారిని షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చడంపై పరిశీలించాలని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఏప్రిల్‌లో ఆదేశించింది. దీనిపై కుకీ తెగవారు అభ్యంతరం తెలిపారు. మే 3న నిరసన ప్రదర్శనను నిర్వహించారు. అప్పటి నుంచి మెయిటీ, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సమస్యపై పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రతిపాదించాయి. దీనిపై ఈ నెల 8, 9, 10 తేదీల్లో లోక్ సభలో చర్చ జరుగుతుంది. మోదీ ఈ నెల 10న సమాధానం చెబుతారు.


ఇవి కూడా చదవండి :

Nuh violence : ఇళ్ల పై కప్పులపై రాళ్లు పోగేశారు, గుట్టల మీదకు ఎక్కారు.. భక్తులపై దాడి చేశారు.. : హర్యానా హోం మంత్రి

Gyanvapi : జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ సైంటిఫిక్ సర్వే పునఃప్రారంభం

Updated Date - 2023-08-05T11:44:56+05:30 IST