Adani: బడ్జెట్ వేళ మరింత కిందకు జారిపోయారు

ABN , First Publish Date - 2023-02-01T18:25:32+05:30 IST

హిండెన్‌బర్గ్‌ (Hindenburg Research) నివేదిక దెబ్బకు కుబేరుల జాబితా నుంచి గౌతమ్ అదానీ (Gautam Adani) మరింత జారిపోయారు.

Adani: బడ్జెట్ వేళ మరింత కిందకు జారిపోయారు
Adani

న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్‌ (Hindenburg Research) నివేదిక దెబ్బకు కుబేరుల జాబితా నుంచి గౌతమ్ అదానీ (Gautam Adani) మరింత జారిపోయారు. స్టాక్‌ మార్కెట్‌ పతనం అదానీ గ్రూప్‌ ప్రధాన ప్రమోటర్‌ గౌతమ్‌ అదానీ కుబేర స్థానానికీ ఎసరుపెట్టింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక దెబ్బకు అదానీ సంపద రోజురోజుకు తరిగిపోతూ వస్తోంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనర్ 2023 జాబితాలో 10వ స్థానంలో ఉన్న అదానీ మరింత కిందకు అంటే 15వ స్థానానికి పడిపోయారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం అదానీ ప్రస్తుత నెట్ వర్త్ 75.1 బిలియన్ అమెరికా డాలర్లు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ 9వ స్థానంలో ఉన్నారు. అంబానీ నెట్ వర్త్ 83.7 బిలియన్ అమెరికన్ డాలర్లు.

బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ జాబితాలో అదానీ 84.5 బిలియన్ అమెరికన్ డాలర్లతో పదో స్థానంలో ఉన్నారు. ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ జెయింట్ ఎల్ఎమ్‌వీహెచ్ బెర్నార్డ్ అర్నౌల్ట్ 191 బిలియన్ అమెరికన్ డాలర్ల నెట్ వర్త్‌తో అగ్ర స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మూడో స్థానంలో, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ నాలుగో స్థానంలో నిలిచారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు.

రిటైల్‌ మదుపరులు, ఉద్యోగులు దూరంగా ఉన్నా సంస్థాగత మదుపరుల అండతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎల్‌) కంపెనీ రూ.20,000 కోట్ల ఎఫ్‌పీఓ ఎట్టకేలకు గట్టెక్కింది. ఆఖరి రోజైన మంగళవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి ఇష్యూ 1.12 రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది. ఈ ఇష్యూ కింద మొత్తం 4.55 కోట్ల షేర్లను కంపెనీ అమ్మకానికి పెట్టగా.. మదుపరుల నుంచి 5.08 కోట్ల షేర్ల కొనుగోలుకు బిడ్స్‌ అందాయి. ఒక్కో షేరు రూ.3,112-3,276 ధరల శ్రేణిలో ఏఈఎల్‌ ఈ షేర్లను అమ్మకానికి పెట్టింది. ఇష్యూ ధర ఖరారు చేసేందుకు ఏఈఎల్‌ బోర్డు బుధవారం సమావేశమవుతోంది. హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో ఈ ఎఫ్‌పీఓ ఇష్యూని పూర్తిగా సబ్‌స్ర్కైబ్‌ చేయించడం ద్వారా అదానీ గ్రూప్‌... మార్కెట్లో తన సత్తాని మరోసారి చాటిందని భావిస్తున్నారు.

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక నేపథ్యంలో తొలి రెండు రోజుల్లో ఈ ఎఫ్‌పీఓ సబ్‌స్ర్కిప్షన్‌ మూడు శాతం మించలేదు. దీంతో అసలు ఈ ఇష్యూ గట్టెక్కుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇష్యూ చివరి రోజైన మంగళవారం సంస్థాగత, వ్యూహాత్మక మదుపరులు రంగంలోకి దిగడంతో ఎఫ్‌పీఓ కొద్దిపాటి ఓవర్‌ సబ్‌స్ర్కిప్షన్‌తో గట్టెక్కింది. మొత్తం ఎఫ్‌పీఓలో 16 శాతం షేర్లను అబుదాబీ రాజకుటుంబానికి చెందిన ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ కంపెనీ (ఐహెచ్‌సీ) అనే సంస్థ తీసుకుంది. ఇందుకోసం ఈ సంస్థ 40 కోట్ల డాలర్లు (సుమారు రూ.3,200 కోట్లు) ఖర్చు చేసింది. ఆఖరి రోజైన మంగళవారం ఈ ఇష్యూలో మదుపు చేసిన సంస్థాగత మదుపరులు పేర్లు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓను గట్టెక్కించిన ఈ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎవరనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అబుదాబీ రాజకుటుంబానికి చెందిన ఐహెచ్‌సీ పేరు తప్ప మరే సంస్థాగత సంస్థ పేరు ఇంకా వెల్లడి కాలేదు. అయితే అదానీలకు సన్నిహితులైన కొందరు పారిశ్రామికవేత్తల కుటుంబాల నేతృత్వంలోని సంస్థలూ తలా ఒక చేయి వేసినట్టు సమాచారం.

అదానీ గ్రూప్‌ను అతలాకుతలం చేస్తున్న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) మళ్లీ విరుచుకుపడింది. ముఖ్యమైన సమస్యల నుంచి దృష్టి మళ్ళించేందుకు ప్రయత్నిస్తూ, జాతీయవాద దృక్పథాన్ని లేవనెత్తుతోందని అదానీ గ్రూప్‌పై ఆరోపణలు గుప్పించింది. ఈ గ్రూప్ తన వేగవంతమైన, ఆకర్షణీయమైన అభివృద్ధిని, దాని చైర్మన్ సంపద పెరుగుదలను భారత దేశ విజయానికి ముడిపెడుతోందని దుయ్యబట్టింది.

హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ (Adani Group) ఆదివారం సమాధానం చెప్తూ, అమెరికన్ షార్ట్ సెల్లర్స్ ‘మడాఫ్స్ ఆఫ్ మన్‌హటన్’ (Madoffs of Manhattan) అని ఆరోపించింది. అమెరికన్ మోసగాడు, ఫైనాన్షియర్ బెర్నార్డ్ లారెన్స్ మడాఫ్ ప్రపంచ చరిత్రలో అతి పెద్ద పోంజీ కుంభకోణానికి పాల్పడిన విషయాన్ని గుర్తు చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ బయటకు చెప్పని కారణాలతో ఈ ఆరోపణలు చేసిందని 413 పేజీలతో కూడిన ఈ సమాధానంలో పేర్కొంది. ఆర్థిక ప్రయోజనాల కోసం ఫాల్స్ మార్కెట్‌ను సృష్టించాలనే రహస్య ఎజెండా హిండెన్‌బర్గ్‌కు ఉందని ఆరోపించింది. అదానీ గ్రూప్ సీఎఫ్ఓ జుగెషిందర్ సింగ్ ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవని ఆరోపించారు.

Updated Date - 2023-02-01T19:21:25+05:30 IST