Nuh violence : ఇళ్ల పై కప్పులపై రాళ్లు పోగేశారు, గుట్టల మీదకు ఎక్కారు.. భక్తులపై దాడి చేశారు.. : హర్యానా హోం మంత్రి

ABN , First Publish Date - 2023-08-05T09:29:03+05:30 IST

హర్యానాలోని నుహ్ జిల్లా, దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం జరిగిన మత ఘర్షణల వెనుక ‘‘బిగ్ గేమ్ ప్లాన్’’ ఉందని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ చెప్పారు. అయితే లోతైన దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆదరాబాదరాగా ఓ నిర్ణయానికి రాబోమని తెలిపారు. పరిస్థితి మెరుగైన తర్వాత ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తామన్నారు.

Nuh violence : ఇళ్ల పై కప్పులపై రాళ్లు పోగేశారు, గుట్టల మీదకు ఎక్కారు.. భక్తులపై దాడి చేశారు.. : హర్యానా హోం మంత్రి
Haryana home minister Anil Vij

చండీగఢ్ : హర్యానాలోని నుహ్ జిల్లా, దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం జరిగిన మత ఘర్షణల వెనుక ‘‘బిగ్ గేమ్ ప్లాన్’’ ఉందని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ (Haryana home minister Anil Vij) చెప్పారు. అయితే లోతైన దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆదరాబాదరాగా ఓ నిర్ణయానికి రాబోమని తెలిపారు. పరిస్థితి మెరుగైన తర్వాత ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తామన్నారు.

అనిల్ విజ్ శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ, బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్ర ప్రారంభానికి ముందే, దేవాలయాల వద్ద ఉన్న కొండలు, గుట్టలపైకి దుండగులు ముందుగానే వెళ్లారని, వారి చేతుల్లో లాఠీలు ఉన్నాయని, ప్రవేశ మార్గాల వద్ద కాపుకాశారని తెలిపారు. ఇదంతా ముందస్తు ప్రణాళిక లేకుండా సాధ్యపడదని చెప్పారు. యాత్రలో పాల్గొన్న భక్తులపైకి తుపాకులతో కాల్పులు జరిపారని చెప్పారు. ఇవన్నీ ఎవరో ఏర్పాటు చేసి ఉండాలన్నారు. తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఇదంతా ఓ ప్రణాళికలో భాగమేనని చెప్పారు.


తుపాకీ కాల్పులు ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ఇళ్ల పై కప్పులపైకి ముందుగానే రాళ్లు చేర్చారని, వాటిని భక్తులపైకి విసిరారని చెప్పారు. కొండలు, గుట్టలపై నుంచి తుపాకీలతో కాల్పులు జరిపారని తెలిపారు. తాము సమాచారం సేకరిస్తున్నామని, బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నుహ్ పోలీస్ సూపరింటెండెంట్ నరేంద్ర సింగ్ బిజర్నియా శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఘర్షణల వెనుక సూత్రధారి ఉన్నట్లు తమకు సమాచారం రాలేదన్నారు. కొన్ని శక్తుల ప్రమేయం ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, వారిని గుర్తించి, అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు.

ముస్లింల ఆధిపత్యంగల నుహ్‌లో విశ్వ హిందూ పరిషత్, మరికొన్ని సంస్థలు కలిసి సోమవారం నిర్వహించిన బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్ర సందర్భంగా మత ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఇద్దరు హోం గార్డులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణలకు సంబంధించి 102 కేసులను నమోదు చేసినట్లు, 202 మందిని అరెస్ట్ చేసినట్లు అనిల్ విజ్ చెప్పారు. 80 మందిని ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అవసరమైనపుడు బుల్డోజర్లను నడుపుతామన్నారు. దోషులను వదిలిపెట్టేది లేదన్నారు. ఈ హింసాకాండ సూత్రధారులు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. జరిగిన ఆస్తి నష్టానికి అందుకు బాధ్యులైనవారే పరిహారం చెల్లించేలా చేస్తామన్నారు. ఈ ఘర్షణలను కవరేజ్ చేసిన మీడియా ప్రతినిధులు తమ వద్ద ఉన్న వీడియో ఫుటేజ్‌లను పోలీసులకు ఇవ్వాలని, దర్యాప్తునకు సహకరించాలని కోరారు. ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు కూడా తమ వద్దనున్న వీడియోలను పోలీసులకు అందజేయాలని కోరారు.

హర్యానాలో యోగి మోడల్

నేరాలకు పాల్పడేవారి అక్రమాస్తులను ధ్వంసం చేసేందుకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనుసరించిన పద్ధతిని హర్యానాలో కూడా అనుసరించారు. గురుగ్రామ్‌ జిల్లాలోని తౌరు పట్టణంలో దాదాపు 250 పూరిళ్లు, గుడిసెలను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. ఆ నివాసాల్లో ఉంటున్నవారు బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలస వచ్చినవారని, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన దాదాపు ఎకరా స్థలంలో మూడేళ్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా ఉన్నారని అధికారులు తెలిపారు. సోమవారం జరిగిన హింసాత్మక ఘటనలకు ఈ కూల్చివేతలకు సంబంధం లేదని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి :

Saudi E-Visa : భారతీయులకు సౌదీ ఈ-వీసా!

Supervision of IIMs: ఐఐఎంల పర్యవేక్షణ అధికారం రాష్ట్రపతికి

Updated Date - 2023-08-05T09:29:03+05:30 IST