Share News

KS Prathima Case: వీడిన మిస్టరీ.. ప్రభుత్వాధికారి ప్రతిమని చంపింది అతడే.. వారం రోజుల క్రితం ఏమైందంటే?

ABN , First Publish Date - 2023-11-06T16:28:59+05:30 IST

కర్ణాటకలో సంచలన సృష్టించిన ప్రభుత్వాధికారి కేఎస్ ప్రతిమ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆమె హంతకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ప్రతిమ వద్ద...

KS Prathima Case: వీడిన మిస్టరీ.. ప్రభుత్వాధికారి ప్రతిమని చంపింది అతడే.. వారం రోజుల క్రితం ఏమైందంటే?

కర్ణాటకలో సంచలన సృష్టించిన ప్రభుత్వాధికారి కేఎస్ ప్రతిమ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆమె హంతకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ప్రతిమ వద్ద పని చేసిన (మాజీ) డ్రైవరే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. ఆ డ్రైవర్ పేరు కిరణ్. తనని ఉద్యోగం నుంచి తొలగించినందుకే ఆమెను చంపేసినట్టు అతడు అంగీకరించాడని సమాచారం. శనివారం రాత్రి 8:30 గంటల సమయంలో ఆమెను హతమార్చి.. బెంగళూరు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామరాజనగర్‌కు కిరణ్ పారిపోయాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై బెంగళూరు పోలీసు కమిషనర్ బీ దయానంద్ మాట్లాడుతూ.. ‘‘ప్రతిమ హత్య కేసులో ఒక అనుమానుతుడ్ని మేము అదుపులోకి తీసుకున్నాం. ప్రతిమ వద్ద అతడు డ్రైవర్‌గా పని చేశాడు. అయితే.. వారం, పది రోజుల క్రితం ప్రతిమ అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించింది’’ అని చెప్పారు. అయితే.. తాము ఇతర కోణాల్లోనూ ఈ కేసుని విచారిస్తున్నామని పేర్కొన్నారు.


ఇదిలావుండగా.. మైన్స్ & జియాలజీ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రతిమ సేవలు అందిస్తున్నారు. ఆమెకు పెళ్లయి ఒక కొడుకు ఉన్నాడు. అయితే.. విభేదాల కారణంగా ఆమె తన భర్తకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రతిమ భర్త, కొడుకు బెంగుళూరు నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీర్థహళ్లిలో నివసిస్తున్నారు. ఎప్పట్లాగే ప్రతిమ శనివారం తన విధులు ముగించుకొని.. దొడ్డకల్లసంద్రలో తాను నివాసముంటున్న గోకుల్ అపార్ట్‌మెంట్‌కు రాత్రి 8 గంటల సమయంలో చేరుకున్నారు. ఆ కాసేపటికే.. అంటే 8:30 గంటలకు ఆమె హత్యకు గురైంది. తొలుత ఆమెకు ఊపరి ఆడకుండా చేసిన నిందితుడు.. ఆ తర్వాత గొంతుకోసి హతమార్చాడు. రాత్రి ఎంత ఫోన్ చేసినా తన సోదరి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో.. ఆదివారం ఉదయం ప్రతీక్ (ప్రతిమ సోదరుడు) ఆమె ఇంటికి చేరుకొని పరిశీలించాడు. ఇంట్లో రక్తపుమడుగులో అచేతనస్థితిలో పడి ఉన్న తన సోదరిని చూసి అతడు షాక్‌కి గురయ్యాడు. పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కేసులో అసలేం జరిగిందనేది తామింకా విచారిస్తున్నామని, ఆ తర్వాతే పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు వెల్లడించారు.

మరోవైపు.. ప్రతిమ ఒక డైనమిక్ లేడీ అని తోటి సీనియర్ అధికారి (పర్యావరణ విభాగం) దినేశ్ తెలిపారు. సోదాలపరంగా, నిందితులపై చర్యలు తీసుకునే విషయంలో ఆమె చాలా ధైర్యంగా వ్యవహరించేవారని అన్నారు. తన పనితీరుతో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారని.. కొన్ని రోజుల క్రితం కూడా కొన్నిచోట్ల తనిఖీలు నిర్వహించారని పేర్కొన్నారు. ప్రతిమకు ఎలాంటి శత్రువులు లేరన్న ఆయన.. ఆమె మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా దినేశ్ చేసిన వ్యాఖ్యల్లో ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నిర్వహించిన తనిఖీలే ప్రతిమ హత్యకు కారణమయ్యాయా? లేక నిజంగానే మాజీ డ్రైవర్ చంపేశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-11-06T16:29:01+05:30 IST