Manipur Violence: బీరేన్ సర్కార్‌ నుంచి వైదొలిగిన కుకీ పీపుల్స్ అలయెన్స్

ABN , First Publish Date - 2023-08-06T21:12:06+05:30 IST

మణిపూర్‌ హింసాత్మక ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్ సింగ్ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్‌కు కుకీ పీపుల్స్ అలయెన్స్ షాక్ ఇచ్చింది. ఎన్డీయే భాగస్వామ్యం నుంచి వైదొలగుతున్నట్టు కేపీఏ ప్రకటించింది.

Manipur Violence: బీరేన్ సర్కార్‌ నుంచి వైదొలిగిన కుకీ పీపుల్స్ అలయెన్స్

ఇంఫాల్: మణిపూర్‌ హింసాత్మక (Manipur Violence) ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్ సింగ్ (N.Biren Singh) సారథ్యంలోని ఎన్డీయే (NDA) సర్కార్‌కు కుకీ పీపుల్స్ అలయెన్స్ (KPA) షాక్ ఇచ్చింది. ఎన్డీయే భాగస్వామ్యం నుంచి వైదొలగుతున్నట్టు కేపీఏ ప్రకటించింది. మణిపూర్ అసెంబ్లీలో కుకీ పీపుల్స్ అలయెన్స్‌ను ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. 160 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన హింసాత్మక ఘటనలను అదుపు చేయడంలో బీరేన్ సింగ్ ప్రభుత్వం విఫలమైందంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కీలక సమయంలో కేపీఏ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.


ఎన్డీయే ప్రభుత్వం నుంచి తెగతెంపులు చేసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు కేపీఏ అధ్యక్షుడు టాంగ్‌మాంగ్ హోకిప్ మణిపూర్ గవర్నర్‌ అనసూయ ఉయికేకు ఒక లేఖ ద్వారా తెలియజేశారు. మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులను కూలంకషంగా పరిశీలించిన తర్వాత బీరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు కొనసాగించడం సాధ్యం కాదని తమ పార్టీ నిర్ణయించిందని, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని, వెంటనే ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్‌ రాసిన లేఖలో టాంగ్‌మాంగ్ తెలియజేశారు.


అసెంబ్లీలో బలాబలాలు..

మణిపూర్‌ అసెంబ్లీలో 60 స్థానాలు ఉండగా, బేజేపీకి 32 మంది సభ్యుల బలం ఉంది. ఐదుగురు ఎన్‌పీఎఫ్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, ఇద్దరు కేపీఏ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. కేపీఏ తాజా నిర్ణయంతో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు బీరేన్ ప్రభుత్వం కోల్పోయింది.

Updated Date - 2023-08-06T21:12:06+05:30 IST