Mansoor Ali Khan: నటి త్రిషను కించపరిచిన కేసులో.. విచారణ ప్రారంభం
ABN , First Publish Date - 2023-11-24T08:38:51+05:30 IST
నటి త్రిష(Actress Trisha)ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళ సినీ విలన్, నటుడు మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan) వద్ద థౌజండ్
చెన్నై, (ఆంధ్రజ్యోతి): నటి త్రిష(Actress Trisha)ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళ సినీ విలన్, నటుడు మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan) వద్ద థౌజండ్ లైట్స్ మహిళా పోలీసుస్టేషన్ పోలీసులు గురువారం సాయంత్రం విచారణ జరిపారు. మన్సూర్ అలీఖాన్... త్రిష గురించి వ్యాఖ్యలు చేసిన వీడియో క్లిప్పింగ్గులను చూపి ఆయన వద్ద పోలీసులు అరగంటసేపు విచారణ జరిపారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో చెన్నై డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేసిన మన్సూర్ అలీఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. నటి త్రిషను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై థౌజండ్ లైట్స్ పోలీసులు కేసు నమోదు చేస్తే, నుంగంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ అల్లి ఈ విషయాన్ని ప్రస్తావించి ‘కోర్టులను క్రీడా మైదానాలని అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్లు తప్పుడు పిటిషన్లు వేయడానికి?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మన్సూర్ అలీఖాన్ తన తప్పిదాన్ని అంగీకరించి బెయిలు పిటిషన్‌ను వెనక్కు చేసుకున్నారు. ఆ తర్వాత తాజాగా మరో పిటిషన్ సమర్పించారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది.