Digital India : మోదీతో సత్య నాదెళ్ల భేటీ... ప్రభుత్వ విధానాలపై సంచలన వ్యాఖ్యలు...

ABN , First Publish Date - 2023-01-05T13:29:49+05:30 IST

మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల (Satya Nadella) గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Digital India : మోదీతో సత్య నాదెళ్ల భేటీ... ప్రభుత్వ విధానాలపై సంచలన వ్యాఖ్యలు...
Satya Nadella, Narendra Modi

న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల (Satya Nadella) గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)తో సమావేశమయ్యారు. డిజిటలైజేషన్ ద్వారా జరుగుతున్న సుస్థిర, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి గురించి చర్చించారు. ఈ వివరాలను సత్య నాదెళ్ల ట్విటర్ వేదికగా తెలిపారు.

లోతైన అవగాహన కలిగేవిధంగా జరిగిన సమావేశం పట్ల సత్య నాదెళ్ల సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ పరివర్తన ద్వారా సుస్థిర, సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించడం స్ఫూర్తిదాయకంగా ఉందని తెలిపారు. డిజిటల్ ఇండియా (Digital India) విజన్ సాకారమయ్యేందుకు సహకరించడానికి, ప్రపంచానికి దివిటీగా నిలిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

సత్య నాదెళ్ల అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ, భారత దేశ డిజిటల్ ఎకొసిస్టమ్‌ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించారు. డిజిటల్ పబ్లిక్ గూడ్స్‌లో దేశం ముందంజలో ఉండటాన్ని చూడటం చాలా గొప్పగా ఉందన్నారు. భారత దేశం ఉందంటే , దానికొక ప్రత్యేకత ఉంటుందని చెప్పారు. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను భారత దేశం వివేకవంతమైన, విజ్ఞానదాయకమైన విధానంలో నిర్మిస్తోందని ప్రశంసించారు. కృత్రిమ మేధాశక్తి (AI - Artificial Intelligence)గల వేదికల అభివృద్ధిలో భారత దేశం ప్రధాన పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. ChatGPT, Dall-E వంటి విస్తృత లాంగ్వేజి మోడల్ - బేస్డ్ ఏఐ టెక్నాలజీలు భవిష్యత్తులో చాలా చాలా ముఖ్యమైనవి అవుతాయన్నారు.

అయితే ఈ ప్లాట్‌ఫామ్స్‌ను ప్రజలు సరైన విధంగా ఉపయోగించుకోవాలన్నారు. అదే సమయంలో వీటివల్ల ఉద్యోగుల తొలగింపు, బిజినెస్ మోడల్స్‌లో మార్పులు వంటివాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.

నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా సత్య నాదెళ్ల బుధవారం విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanyam Jaishankar)తో సమావేశమయ్యారు. ఇరువురు డిజిటల్ గవర్నెన్స్, భద్రత గురించి చర్చించారు.

Updated Date - 2023-01-05T13:29:53+05:30 IST