Share News

Minister: మంత్రికి చుక్కెదురు.. బెయిల్‌ పిటిషన్‌ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2023-11-29T07:32:35+05:30 IST

మంత్రి సెంథిల్‌ బాలాజీ(Minister Senthil Balaji) బెయిలు పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. చట్టవ్యతిరేక నగదు

Minister: మంత్రికి చుక్కెదురు.. బెయిల్‌ పిటిషన్‌ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

పెరంబూర్‌(చెన్నై): మంత్రి సెంథిల్‌ బాలాజీ(Minister Senthil Balaji) బెయిలు పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. చట్టవ్యతిరేక నగదు బట్వాడా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అరెస్ట్‌ చేసిన మంత్రి సెంథిల్‌ బాలాజి స్థానిక పుళల్‌ కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయన దాఖలుచేసిన బెయిలు పిటిషన్‌ను చెన్నై ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టు తోసిపుచ్చింది. దీంతో వైద్య కారణాలు చూపి బెయిలు మంజూరు చేయాలనే సెంథిల్‌ బాలాజి పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కూడా తోసిపుచ్చింది. దీంతో, బెయిలు కోరుతూ ఆయన తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ ముగిసిన నేపథ్యంలో, వైద్య కారణాలతో బెయిలు ఇచ్చేందుకు వీలుకాదని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం, బెయిలు పిటిషన్‌ తోసిపుచ్చింది. ఈడీ అధికారులు అరెస్ట్‌ చేసిన సమయంలో ఆయన గుండెనొప్పికి గురయ్యారు. దీంతో, ఆయనకు బైపాస్‌ సర్జరీ చేశారు. పుళల్‌ జైలులో ఉన్న ఆయన అస్వస్థతకు గురికావడంతో ఓమందూర్‌ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. సెంథిల్‌ బాలాజి ఆరోగ్య నివేదిక ఆధారంగా, బెయిలుపై వస్తే మాత్రమే ఆయనను పర్యవేక్షించవచ్చు అనడంపై ఆయన ఆరోగ్యం అంత ఇబ్బందికరంగా లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. అలాగే, సెంథిల్‌ బాలాజి మెదడు సంబంధిత ఇబ్బందులపై గూగుల్‌లో వెతికానని, మందులు వేసుకొంటే ఆ సమస్య సరిచేయవచ్చని తెలిసిందన్నారు. నేడు బైపాస్‌ సర్జరీలు... అపెండిసైటిస్‌ శస్త్రచికిత్సల వలే సాధారణమయ్యాయని, అందువల్ల వైద్య కారణాలతో సెంథిల్‌ బాలాజీకి బెయిలు ఇవ్వలేమని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

Updated Date - 2023-11-29T07:32:36+05:30 IST