Sudan Crisis: భారతీయుల భద్రతపై మోదీ అత్యున్నత స్థాయి సమావేశం
ABN , First Publish Date - 2023-04-21T16:39:46+05:30 IST
సూడాన్ లో సైన్యం, పారామిలటరీ దళాల మధ్య పోరు సాగుతుండటంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు..
న్యూఢిల్లీ: సూడాన్ (Sudan)లో సైన్యం, పారామిలటరీ దళాల మధ్య పోరు సాగుతుండటంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతను శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. గత శనివారం నుంచి ప్రారంభమైన సూడాన్ ఘర్షణల్లో ఇంతవరకూ 350 మంది వరకూ మృతి చెందిన నేపథ్యంలో ఈ అత్యున్నత స్థాయి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధానమంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా, ఇండియాలో సూడాన్ రాయబారి బీఎస్ ముబారక్, ఈజిప్టు, రియాద్ రాయబారులు, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్, కేంద్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ (కాన్సులర్, పాస్‌పోర్ట్, వీసా అండ్ ఓవర్సీస్ ఇండియన్ ఎఫైర్స్) డాక్టర్ ఎ.సయూద్ తదితరులు పాల్గొన్నారు.
సూడన్‌లో సైన్యం, పాలమిటరీల బలగాల మధ్య ఘర్షణలో సంఖ్యాపరంగా ఎంతమంది భారతీయులు చిక్కుకున్నారనే దానిపై ఇంకా అస్పష్టత ఉంది. ఘర్షణలు పెరుగుతుండటంతో వేలాది మంది పౌరులు సూడాన్ రాజధాని ఖార్తూమ్ విడిచిపెట్టి వెళ్తున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఏప్రిల్ 20న న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గెటెరెస్‌తో సమావేశమై సూడాన్‌లోని పరిస్థితులపై చర్చించారు. తమ మధ్య సూడాన్ పరిస్థితిపై అర్ధవంతమైన చర్చ జరిగిందని, జీ-20, ఉక్రెయిన్‌లో ఘర్షణలు కూడా చర్చించామని, అయితే ప్రధానంగా సూడాన్‌పై చర్చ జరిపామని జైశంకర్ తెలిపారు. సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులతో ఢిల్లీలోని తమ బృందం ఎప్పడికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు.
కాగా, సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు సాగిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందర్ బాగ్చి తెలిపారు. వివిధ మాధ్యమాల ద్వారా సూడాన్‌లోని భారతీయులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఎప్పటికప్పుడు అడ్వయిజరీలు జారీ చేస్తున్నామని అన్నారు.
పారామిటలరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌ను సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదన సూడాన్‌లోని ఆర్మీ-పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఈ విషయంలో సైన్యాధినేత అబ్దెల్ ఫథా అల్ బుర్హాన్, పారామిలటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్రో మధ్య కొద్దికాలంగా నెలకొన్న విభేదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్నాయి.