Modi America Visit : ఈ నెల 20 నుంచి మోదీ అమెరికా పర్యటన.. ముఖ్యాంశాలు ఏమిటంటే..

ABN , First Publish Date - 2023-06-16T14:36:25+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ నెల 20న రెండు దేశాల పర్యటనకు బయల్దేరబోతున్నారు. ఐదు రోజులపాటు అమెరికా, ఈజిప్టు దేశాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్డెల్ ఫట్టాహ్ ఎల్-సిసిలతో చర్చలు జరుపుతారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో యోగా సెషన్‌లో పాల్గొంటారు.

Modi America Visit : ఈ నెల 20 నుంచి మోదీ అమెరికా పర్యటన.. ముఖ్యాంశాలు ఏమిటంటే..
Narendra Modi

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ నెల 20న రెండు దేశాల పర్యటనకు బయల్దేరబోతున్నారు. ఐదు రోజులపాటు అమెరికా, ఈజిప్టు దేశాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్డెల్ ఫట్టాహ్ ఎల్-సిసిలతో చర్చలు జరుపుతారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో యోగా సెషన్‌లో పాల్గొంటారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆ దేశ ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ (Jill Biden) ఆహ్వానం మేరకు ఆ దేశ ప్రభుత్వ అతిథిగా మోదీ పర్యటిస్తారు. అదేవిధంగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్డెల్ ఫట్టాహ్ ఎల్-సిసి ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటిస్తారు.

మోదీ పర్యటన వివరాలు :

జూన్ 21 : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస సాధారణ సభ 2014 డిసెంబరులో ప్రకటించింది.

జూన్ 22 : వాషింగ్టన్‌లోని శ్వేత సౌధం (White House)లో మోదీకి అంగరంగవైభవంగా స్వాగతం పలుకుతారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden)తో అత్యున్నత స్థాయి చర్చలు కొనసాగిస్తారు. అదే రోజు రాత్రి మోదీ గౌరవార్థం బైడెన్ దంపతులు ప్రభుత్వ లాంఛనాలతో విందు ఇస్తారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కేథీ, సెనేట్ స్పీకర్ చార్లెస్ షుమర్ సహా కంగ్రెషనల్ నేతల ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

జూన్ 23 : అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ కలిసి మోదీకి విందు ఇస్తారు. ప్రధాన కంపెనీల సీఈఓలు, ప్రొఫెషనల్స్, ఇతర ప్రముఖులతో మోదీ మాట్లాడతారు. భారతీయ మూలాలగలవారితో కూడా ఆయన మాట్లాడతారు.

జూన్ 24-25 : మోదీ జూన్ 24న ఈజిప్టు రాజధాని నగరం కైరో చేరుకుంటారు. ఈజిప్టు అధ్యక్షుడు ఎల్-సిసి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఆయన ఆహ్వానం మేరకు మోదీ ఈజిప్టులో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా మోదీ ఈజిప్టులోని ప్రముఖులతో మాట్లాడతారు. అదేవిధంగా భారతీయ మూలాలుగలవారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

భారత్-ఈజిప్టు సంబంధాలకు గొప్ప చరిత్ర ఉంది. వాణిజ్య, ఆర్థిక సంబంధాలతో పాటు ఇరు దేశాల ప్రజల మధ్య కూడా వందల సంవత్సరాల నుంచి సత్సంబంధాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

Modi Vs Congress : నెహ్రూ మెమొరియల్ మ్యూజియం పేరు మార్పు.. కాంగ్రెస్ ఆగ్రహం..

Manipur : మణిపూర్‌లో ఆగని హింసాకాండ.. కేంద్ర మంత్రి ఇంటిపై దాడి, దహనం..

Updated Date - 2023-06-16T15:43:51+05:30 IST