Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
ABN , First Publish Date - 2023-09-29T18:16:42+05:30 IST
పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక 'మహిళా రిజర్వేషన్ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారంనాడు ఆమోదించారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం సంతరించుకుంది.
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక 'మహిళా రిజర్వేషన్ బిల్లు' (Women's Reservaion bill)కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) శుక్రవారంనాడు ఆమోదించారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం సంతరించుకుంది.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన నారీ శక్తి వందన్ అధినియమ్ (Nari Shakti Vandan Adhiniyam) బిల్లును పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ 19న లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం లోక్‌సభ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. సెప్టెంబర్ 21న రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టగా పెద్దలసభ సైతం బిల్లుకు ఆమోద ముద్ర తెలిపింది. ఉభయసభల ఆమోదం పొందిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. అయితే, చట్టం తక్షణం అమల్లోకి వచ్చే అవకాశాలు మాత్రం లేనట్టే. జనగణన, డీలిమిటెషన్ తర్వాత చట్టాన్ని అమల్లోకి తెస్తామని బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ లోక్‌సభకు తెలుపగా, 2024 ఎన్నికలు పూర్తికాగానే జనగణన ప్రారంభిస్తామని హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. ప్రస్తుత డీలిమిటేషన్ ప్రక్రియ 2026 వరకూ అమల్లో ఉండనుంది. దీంతో ఆ తర్వాతే డీలిమిటేషన్ జరగాల్సి ఉంటుంది.