Women reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు అప్పట్నించే అమల్లోకి.. నిర్మలా సీతారామన్ వెల్లడి
ABN , Publish Date - Dec 16 , 2023 | 03:58 PM
మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2024 జనాభా లెక్కల తర్వాత మహిళ రిజర్వేషన్ బిల్లు అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు.
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's reservation) ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) వెల్లడించారు. 2024 జనాభా లెక్కల (2024 census) తర్వాత మహిళ రిజర్వేషన్ బిల్లు అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దక్షణ కన్నడ జిల్లాలో శనివారంనాడు రాణి అబ్బక్క (Rani Abbakka) స్మారక తపాలా బిళ్ల (Postal stamp)ను కేంద్ర మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. జాతి నిర్మాణంలో మహిళల పాత్ర గణనీయమైనదని ప్రధాని భావిస్తుంటారని, మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా దానికి వాస్తవరూపం కల్పించారని అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను కల్పించనున్నారు. గత సెప్టెంబర్‌లో ఈ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించగా, సెప్టెంబర్ 29 దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.
రాణి అబ్బక్క సాహసం నిరుపమానం
పోర్చుగీసు వారికి ఎదురొడ్డి నిలిచిన వీరవనిత రాణి అబ్బక్క అని, 16వ శతాబ్దానికి చెందిన ధీరవనిత అని నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. సామ్రాజ్యవాద శక్తులతో పోరాడిన ఎందరో వెలుగులోకి రాని వీరుల చరిత్రను డాక్యుమెంటేషన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. మహిళా స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రపై మూడు పుస్తకాలను తెచ్చేందుకు 'అమర్ చిత్ర కథ'తో కేంద్ర సాంస్కృతిక సంస్థ ఒప్పందం చేసుకుందని తెలిపారు. కోస్టర్ కర్ణాటకలో రాణి అబ్బక్క పేరుతో సైనిక్ స్కూల్ ఏర్పాటు జరుగుతుందన్న ఆశాభావాన్ని నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు.