World Press Freedom Day 2023: పదేళ్లలో వృత్తి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల సంఖ్య ఇదే
ABN , First Publish Date - 2023-05-03T15:54:32+05:30 IST
నేడు(మే3) ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం(World Press Freedom Day). మానవ హక్కుల ప్రాముఖ్యత, వాటిని పరిరక్షించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రభుత్వాలు మంచి పాలనను అందించడంలో పత్రికారంగం కీలక పాత్ర పోషిస్తోంది.
నేడు(మే3) ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం(World Press Freedom Day). మానవ హక్కుల ప్రాముఖ్యత, వాటిని పరిరక్షించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రభుత్వాలు మంచి పాలనను అందించడంలో పత్రికారంగం కీలక పాత్ర పోషిస్తోంది.
పత్రికారంగంలో ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారం, వృత్తి నిర్వహణలో జర్నలిస్టుల స్వేచ్ఛ, సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడంలో వారి సహకారం వంటి అంశాలపై చర్చించేందుకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటాం. మరి మే3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా సమాజానికి నాలుగో స్థంభంగా కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఒకసారి గమనిద్దాం..
ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయి. వృత్తి నిర్వహణలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరొకొందరు తీవ్రంగా గాయపడ్డారు. పత్రికారంగంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల హత్యలకు సంబంధించి ప్రెస్ ఎంబ్లెన్స్ క్యాంపెయిన్(PEC) తాజా గణాంకాలను వెల్లడించింది. 2013 నుంచి ఇప్పటివరకు మొత్తం 1136 మంది జర్నలిస్టులు వృత్తి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. సగటున సంవత్సరంలో 113 చొప్పున, వారానికి ఇద్దరు చొప్పున జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారు.
ఈ యేడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 16 మంది జర్నలిస్టులు హత్యకు గురికాగా.. 2022లో 116, 2021లో 79, 2020లో 92, 2019లో 75, 2018లో 117, 2017లో 99, 2016లో 135, 2015లో 138, 2014లో 129, 2013లో 141 మంది జర్నలిస్టులు హత్యకు గురైనట్లు PEC తెలిపింది.
ఇప్పటివరకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులు జాబితాను PEC సభ్యులు, వార్తాసంస్థలు, స్థానిక మీడియా, జాతీయ పత్రికాసంఘాలు, IFJ, యునెస్కో, NGO తెలిపిన వివరాల ఆధారంగా ఈ జాబితాను తయారు చేసింది.
చాలా దేశాల్లో డిజిటల్ సాంకేతికత, స్వతంత్ర మీడియా వృద్ధి, అపరిమిత సమాచార వ్యాప్తిని సులభతరం చేశాయి. అయినప్పటికీ మీడియా స్వేచ్ఛ, జర్నలిస్టుల భద్రత, భావప్రకటనా స్వేచ్ఛకు ముప్పు వాటిల్లుతోంది. ప్రాథమిక మానవ హక్కులపై ప్రతికూల ప్రభావానికి దారి తీస్తుంది.