Indian Expat: 14ఏళ్లుగా యూఏఈలో ఉంటున్న భారతీయుడు.. అదృష్టం వరించడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారాడు..!
ABN , First Publish Date - 2023-03-16T10:04:04+05:30 IST
గడిచిన 14 ఏళ్ల నుంచి ఓ భారత ప్రవాసుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) రాజధాని అబుదాబిలో నివాసం ఉంటున్నాడు.
అబుదాబి: గడిచిన 14 ఏళ్ల నుంచి ఓ భారత ప్రవాసుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) రాజధాని అబుదాబిలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉండే ఓ సూపర్ మార్కెట్ చైన్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా (Graphic Designer) పని చేస్తున్న అతడు.. గత కొన్నేళ్ల నుంచి మహజూజ్ డ్రాలో (Mahzooz Draw) పాల్గొంటున్నాడు. ఇప్పటికే పలుమార్లు చిన్న చిన్న బహుమతులు కూడా గెలుచుకున్నాడు. కానీ, గత శనివారం (మార్చి 11న) నిర్వహించిన వీక్లీ డ్రాలో మనోడికి జాక్‌పాట్ తగిలింది. ఏకంగా 1మిలియన్ దిర్హమ్స్ (రూ. 2.25కోట్లు) గెలుచుకున్నాడు. దాంతో అతడి ఆనందానికి అవధుల్లేవు.
వివరాల్లోకి వెళ్తే.. 38 ఏళ్ల దిపిష్ (Dipish) అనే భారత ప్రవాసుడు 14 ఏళ్ల నుంచి భార్య, కూతురితో కలిసి అబుదాబిలో ఉంటున్నాడు. అతడు గ్రాఫిక్ డిజైనర్. స్థానికంగా ఉండే ఓ సూపర్ మార్కెట్ చైన్‌లో ఉద్యోగి. అయితే, స్నేహితుల సూచనతో గడిచిన కొన్నేళ్ల నుంచి మహజూజ్ డ్రాలో పాల్గొంటున్నాడు. దాంతో అప్పడప్పుడు కొన్ని చిన్న బహుమతులు కూడా వరించాయి. అయితే, మార్చి 11న (శనివారం) నిర్వహించిన 119వ వారాంతపు డ్రాలో మనోడు జాక్‌పాట్ (Jackpot) కొట్టాడు. ఏకంగా ఒక మిలియన్ దిర్హమ్స్ గెలిచాడు. అంతే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారాడు.
ఇది కూడా చదవండి: తగ్గేదేలే అంటున్న కువైత్.. 1,815 మంది ప్రవాస టీచర్లకు ఉద్వాసన..!
ఈ సందర్భంగా దిపిష్ మాట్లాడుతూ.. "రోజులానే మార్చి 11వ తేదీ సాయంత్రం మెయిల్ చెక్ చేస్తున్నాను. ఇంతలో మహజూజ్ నుంచి వచ్చిన ఒక ఈ-మెయిల్ కనిపించింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే.. మిలియన్ దిర్హమ్స్ గెలిచినట్లు ఉంది. మొదట అసలు నమ్మలేదు. వెంటనే భార్యను పిలిచి చూపించాను. ఆమె చూసి ఎగిరిగంతేసినంత పని చేసింది. దాంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిత్రులకు ఈ విషయం చెప్పి, మహజూజ్ అధికార వెబ్సైట్ ద్వారా నిజంగానే అంతా భారీ నగదు గెలిచానా? అని ధృవీకరించాల్సిందిగా కోరాను. వాళ్లు కూడా అది నిజమేనని చెప్పడంతో నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి" అని చెప్పుకొచ్చాడు. ఇక తాను గెలిచిన ఈ భారీ ప్రైజ్‌మనీలో కొంత భాగాన్ని చారిటీకి ఉపయోగిస్తానని చెప్పి దిపిష్ తన ఉదారతను చాటుకున్నాడు.
ఇది కూడా చదవండి: 'ఆ వ్యవధిలో కొత్త పని వెతుక్కోవడం కష్టం.. దానివల్ల ప్రతిభావంతుల్ని కోల్పోతున్నాం'