Share News

Telugu Expat: దేశం కాని దేశంలో ఈ తెలుగు రోగికి వచ్చిన కష్టం.. వింటే కన్నీళ్లు ఆగవు!

ABN , First Publish Date - 2023-12-09T10:16:20+05:30 IST

లోతైన బావి నుండి అతి కష్టంగా వినిపించే విధంగా ధ్వని... శ్రధ్ధతో వింటే గానీ వినబడదు, ముందు మోబైల్ మోగుతున్నా కనీసం ఎత్తలేని చేతులు, కదలలేని కాళ్ళు... పూర్తిగా అచేతన శరీరం జీవితంపై నైరాశ్యంతో కనికరంలేని సమాజంలో ఒక తెలుగు పలుకులకై తపించిపోయాడో ఓ అభాగ్యుడు.

Telugu Expat: దేశం కాని దేశంలో ఈ తెలుగు రోగికి వచ్చిన కష్టం.. వింటే కన్నీళ్లు ఆగవు!

భాషా రాక, చేతులు ఎత్తలేక.. హైద్రాబాద్ విమానం ఎక్కలేకపోయిన తెలుగు రోగి

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: లోతైన బావి నుండి అతి కష్టంగా వినిపించే విధంగా ధ్వని... శ్రధ్ధతో వింటే గానీ వినబడదు, ముందు మోబైల్ మోగుతున్నా కనీసం ఎత్తలేని చేతులు, కదలలేని కాళ్ళు... పూర్తిగా అచేతన శరీరం జీవితంపై నైరాశ్యంతో కనికరంలేని సమాజంలో ఒక తెలుగు పలుకులకై తపించిపోయాడో ఓ అభాగ్యుడు. కనీసం నోరు విప్పి మాట్లాడలేని స్ధితిలో కళ్ళ ముందు నుండి హైద్రాబాద్ విమానం వెళ్ళిపోయినా అందులో వెళ్ళలేక ఏకాకిగా మిగిలి తన నిస్సహాయుత దీనస్ధితిపై ఏడుస్తూ విమానాశ్రయంలో ఏకాకిగా మిగిలిపోయిన ఆ దౌర్భాగ్యుడి విషాదగాధ వింటే కన్నీళ్లు ఆగవు.

పూర్తిగా అచేతన శరీరం జీవితంపై నైరాశ్యంతో కనికరం లేని సమాజంలో ఒక తెలుగు పలుకులకై తపించిపోయాడో ఓ ఆభాగ్యుడు. తనకు ఏవరైనా గ్లాసుతో మంచినీళ్ళయినా త్రాగిస్తే అమృతం కంటే ఎక్కువ అని అతృతపడ్డ అతనికి భాషా అడ్డువచ్చింది. కనీసం సైగలు చేయడానికి శరీరం సహకరించలేదు. వేల మంది ప్రయాణికుల మధ్యలో ఉండి కూడా ఏకాకిగా మిగిలిపోయాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అబ్బిడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ఇంట్లో డ్రైవర్‌గా పని చేయడానికి వచ్చిన కొద్ది నెలలకు అనారోగ్యానికి గురయి ఆసుపత్రిలో చేరాడు. ఎంతకు నయం కాకపోగా పరిస్ధితి మరింత క్షీణిస్తుండడంతో యాజమాని అతన్ని స్వదేశానికి పంపించే ప్రయత్నంలో తన సమీప పట్టణం నుండి జెద్ధా మీదుగా హైద్రాబాద్‌కు విమానం టిక్కేట్ కొనుగోలు చేశాడు. అతను వీల్‌చైర్‌పై డోమెస్టిక్ విమానం ద్వారా జెద్ధాకు చేరుకుని అక్కడి నుంచి హైద్రాబాద్‌కు అంతర్జాతీయ విమానంలో వెళ్ళాలి. ఇందుకు అతను బోర్డింగ్ పాసు తీసుకోని వీల్‌చైర్‌పై డిపార్చర్ గేటు ముందు కూర్చున్నాడు. అచేతనంగా ఉన్న శ్రీనివాస్‌కు మాట్లాడడం కష్టం అతికష్టంగా మాట్లాడి తన బోర్డింగ్ పాస్‌ను చూపించే సరికి రాంప్ గేటు మూసివేయబడింది. దాంతో విమానం తప్పిపోయి ఏడ్చుకొంటూ కూర్చున్నాడు.

హైద్రాబాద్‌కు విమానం మరో మూడు రోజుల వరకు లేదు. కూర్చోవడం కష్టంగా ఉన్న తన పరిస్ధితి ఏమిటని కుమిలిపోయాడు. భయాందోళనతో వణికిపోయాడు. ఇతని గురించి తెలుసుకున్న ఒక వ్యక్తి జెడ్డా నగరంలోని చాలా మంది తెలుగు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాడు. కానీ, వారందరూ కూడా వారివారి వ్యక్తిగత, అనీవార్య కారణాల వల్ల కనీసం విమానశ్రాయానికి రావడానికి కూడా ఆసక్తి చూపలేదు. స్వచ్ఛంద సేవలంటూ చేప్పే కొందరు ప్రముఖులు కూడా ముఖం చాటేశారు. ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో ఆ వ్యక్తే తన వెంట తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ, ప్రయాణికుడి పాస్ పోర్టుపై ఎగ్జిట్ లేదా ఖురుజ్ స్టాంప్ కావడంతో అతన్ని బయటకు వదలడానికి వీలు లేకపోయింది. దాంతో రాత్రంతా విమానశ్రాయంలో ఉండి అతనికి తదుపరి విమానం టిక్కేట్‌ను మార్చడంతో పాటు హోటల్‌లో బస ఏర్పాటు చేయించడం జరిగింది. ఎట్టకేలకు శ్రీనివాస్ శుక్రవారం స్వదేశానికి బయల్దేరాడు.

వివిధ పండుగలు, సందర్భాలు అంటే ఆసక్తి చూపించే తెలుగు సమాజం ఈ రకమైన అపన్న హస్తం అందించే సమయానికి అదృశ్యమవుతుండడం విస్మయం కల్గిస్తుంది. అనారోగ్యంతో ఉన్న ఈ ప్రయాణికుడ్ని అప్యాయతతో తెలుగులో మాట్లాడి ఒక చిన్న మంచి నీళ్ళ సీసాను అందిస్తే, అతనికి ఆకాశం ఎక్కించినంత కొండంత మనోబలం వస్తుంది. మనకు తోచిన ఒక చిన్న మాములు సహాయం అవతలి వ్యక్తి జీవితంలో అందులోనూ చివరి అంకంలో అది అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంటుంది.

  • మరిన్ని NRI NEWS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-09T10:16:21+05:30 IST