Tramadol Tablets: సౌదీలో తెలుగు యువకుడి బ్యాగ్లో ట్రామాడోల్ ట్యాబ్లెట్స్.. డాక్టర్లే వాడమన్నారన్నా వినని అధికారులు.. చివరకు..
ABN , First Publish Date - 2023-05-17T17:40:33+05:30 IST
శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాసుపల్లి రాంబాబు అనే ఓ తెలుగు యువకుడు సౌదీలో జైలు పాలయ్యాడు. భారత్లోని డాక్టర్లు వాడమన్న ట్రామాడోల్ ట్యాబ్లెట్ను సౌదీకి వెళ్లినా వాడుతోంటే.. ఆ మాత్రలే అతడిని జైలు పాలు చేశాయి. ఆ తర్వాత అతడిని బెయిల్ పై విడుదల చేసినా.. సౌదీ దాటి వెళ్లకుండా ఆంక్షలు విధించడంతో అతడు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. ఏపీఎన్నార్టీ కోఆర్డినేటర్ సాయంతో ఎట్టకేలకు సమస్య పరిష్కారమయింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ‘సౌదీలో కఠిన చట్టాలు ఉంటాయి. భారత్లో అసలు తప్పే కాని కొన్ని పనులను కూడా సౌదీలో చట్టరీత్యా నేరాలుగా పరిగణిస్తుంటారు. అందుకే సౌదీకి వెళ్లాలి అనుకునే భారతీయులు తప్పనిసరిగా అక్కడి చట్టాలను ముందే ఆరా తీయాలి. ఏఏ పనులు చేయొచ్చో.. ఏమేం చేయకూడదో తప్పనిసరిగా తెలుసుకోవాలి..’.. ఇదీ భారతీయ అధికారులే కాదు.. సౌదీలో ఎన్నో ఏళ్లుగా ఉండే ప్రవాసులు సైతం చెప్పే మాటలు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా కొందరు మాత్రం తెలిసో తెలియకో చిక్కుల్లో పడుతూనే ఉన్నారు. ఓ తెలుగు యువకుడు కూడా అలాగే సౌదీలో జైలు పాలయ్యాడు. భారత్లోని డాక్టర్లు వాడమన్న ట్యాబ్లెట్ను సౌదీకి వెళ్లినా వాడుతోంటే.. ఆ మాత్రలే అతడిని జైలు పాలు చేశాయి. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయినా సొంతూరికి తిరిగి వెళ్లలేక ఇన్నాళ్లూ ఇబ్బందులు పడ్డాడు. అసలు విషయంలోకి వెళ్తే..
సౌదీ అరేబియాలోని ఒక నౌకయాన సంస్ధలో శ్రీకాకుళం జిల్లా ఎత్చెర్ల మండలానికి చెందిన వాసుపల్లి రాంబాబు అనే 25 ఏళ్ళ యువకుడు పనిచేస్తున్నాడు. గతేడాది నవంబర్ నెలలో ఎర్ర సముద్ర తీరంలో తాను పని చేస్తున్న నౌక నుండి దిగి ఇంటికి తిరిగెళ్తున్నాడు. అయితే అదే సమయంలో అక్కడి కస్టమ్స్ అధికారుల సాధారణ తనఖీలను నిర్వహిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో రాంబాబు బ్యాగులో ట్రామాడోల్ ( Tramadol ) ట్యాబ్లెట్స్ దొరికాయి. వాటిని వాడటం అక్కడ చట్టరీత్యా నేరం. సౌదీలో అవి నిషేధం. వాటిని మాదకద్రవ్యాలుగా పరిగణిస్తుంటారు. దీంతో అతడిని సౌదీ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
‘నిత్యం సముద్రయానంలో ఉండే నాకు అలల వల్ల అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతూ ఉంటాను. భారత్ కు వెళ్లినప్పుడు అక్కడి వైద్యులు ట్రామాడోల్ ట్యాబ్లెట్స్ను వాడమని సూచించారు. వాటిని వాడటం వల్ల నాకు ఉపశమనం కలిగేది. వైద్యుల సూచన మేరకే నేను వాటిని వాడుతున్నాను..’ అంటూ రాంబాబు ఎంత చెప్పినా అక్కడి అధికారులు వినిపించుకోలేదు. పైగా అతడి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా జైలుకు పంపారు. ఆ తర్వాత ఆ ట్యాబ్లెట్స్ను లాబోరేటరీకి పంపించిన అధికారులు, కేసు పూర్తయ్యే దాకా దేశం విడిచి వెళ్ళకుండా ప్రయాణంపై నిషేధం విధించారు. ఆ తర్వాత అతడిని బెయిల్ పై విడుదల చేశారు.
అయితే నెలల తరబడి తిరుగుతున్నా ఈ కేసులో ఏలాంటి పురోగతి లేకపోవడంతో బాధితుడి తల్లి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ద్వారా ఎపీఎన్నార్టీ కోఆర్డినేటర్, తెలుగు కళా క్షేత్రం అధ్యక్షుడు అంటోనీని సంప్రదించారు. ఆయన కొన్ని నెలలు పాటు చేసిన ప్రయత్నాలు ఫలించి ప్రయాణంపై నిషేధాన్ని తొలగించేలా చేశారు. దీంతో ఎట్టకేలకు రాంబాబు సోమవారం స్వస్ధలానికి తిరిగి వెళ్ళాడు. కాగా, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరికొందరు యువకులకు సంబంధించి ఇతర సమస్యల కేసులు కూడా వివిధ దశలలో పరిష్కార దిశలో ఉన్నాయనీ.. వాటిని కూడా పరిష్కరించే దిశగా తాను ప్రయత్నిస్తున్నట్లుగా అంటోనీ వెల్లడించారు. కేసులు పరిష్కారమయ్యే వరకు ఓర్పుతో వ్యవహారించాలని కూడా ఆయన సూచించారు.