Share News

TS Assembly Polls : నాంపల్లిపై నజర్‌!

ABN , First Publish Date - 2023-11-22T15:31:01+05:30 IST

మజ్లిస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ ఫిరోజ్‌ఖాన్‌ గట్టి పోటీ ఇస్తున్నారు.

TS Assembly Polls : నాంపల్లిపై నజర్‌!

  • వార్‌ కాంగ్రెస్‌, ఎంఐఎం మధ్యే

  • అభ్యర్థిని మార్చినా మజ్లిస్‌కు ఎదురుగాలి

  • తీవ్రంగా చెమటోడ్చాల్సిన పరిస్థితి

  • ముచ్చెమటలు పట్టిస్తున్న ప్రత్యర్థి ఫిరోజ్‌ఖాన్‌

  • మూడుసార్లు విజయం చేజారిన వైనం

  • బోగస్‌ ఓట్ల తొలగింపుతో విజయం తమదే అంటున్న కాంగ్రెస్‌

మంగళ్‌హాట్‌, నవంబర్‌22 (ఆంధ్రజ్యోతి): మజ్లిస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ ఫిరోజ్‌ఖాన్‌ గట్టి పోటీ ఇస్తున్నారు. అభ్యర్థులను మార్చి ఎన్నికల్లోకి వెళ్తున్నా ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు ఎదురుగాలి వీస్తోంది. అక్కడ మూడు పర్యాయాలుగా పోటీ చేస్తున్న ప్రత్యర్థి మహ్మద్‌ ఫిరోజ్‌ఖాన్‌ ముచ్చెటములు పట్టిస్తున్నారు. మూడు దఫాలు విజయం దరిదాపుల్లోకి వచ్చి వెళ్లిన ఆయనకు సానుభూతి కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు బోగస్‌ ఓట్లు తొలగించడంతో విజయం తమదే అంటూ కాంగ్రెస్‌ నేతలు లెక్కలేస్తున్నారు. ఎంఐఎంకు ఇలాంటి పరిస్థితి రావడానికి ఆ పార్టీ నాయకుల పనితీరుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లినట్లు చెబుతుండటం గమనార్హం.

మూడు సార్లు ఒక్కడే ప్రత్యర్థి

ఎంఐఎం పార్టీకి నాంపల్లి నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో ఎంఐఎంకు నాంపల్లి నియోజకవర్గంలో గెలుపు ఓ సవాల్‌గా మారింది. ఆ పార్టీ అభ్యర్థి మహ్మద్‌ విరాసత్‌ రసూల్‌ ఖాన్‌ ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన మహ్మద్‌ ఫిరోజ్‌ ఖాన్‌పై కేవలం 6,799 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నాడు బీజేపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు 22,520 ఓట్లు వచ్చాయి. 2014లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఫిరోజ్‌ ఖాన్‌ విజయం సాధిస్తారనే అంచనాతో ఎంఐఎం అభ్యర్థినే మార్చి జాఫర్‌ హుస్సేన్‌ను బరిలోకి దింపింది. నాటి ఎన్నికల్లో జాఫర్‌ హుస్సేన్‌కు 63,652 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌ 46,356 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 17,296 ఓట్ల మెజార్టీతో జాఫర్‌ హుస్సేన్‌ విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లోనూ ఎంఐఎం తరఫున జాఫర్‌ హుస్సేన్‌కు టికెట్‌ కేటాయించి నాంపల్లి బరిలో దింపింది. ఈ సారి ఫిరోజ్‌ఖాన్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. ఎంఐఎం అభ్యర్థికి 57,940 ఓట్లు రాగా ఫిరోజ్‌ ఖాన్‌కు 48,265 ఓట్లు వచ్చాయి. 9,675 ఓట్ల మెజార్టీతో ఎంఐఎం విజయం సాధించింది. గత మూడు పర్యాయాల్లో ఎంఐఎం అభ్యర్థులకు ఫిరోజ్‌ఖాన్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అసలు ఎంఐఎంకు ఓటమి తప్పదనే తరహాలో ఫిరోజ్‌ వ్యవహార శైలి ఉండడంతో పాటు 2018లో ఎంఐఎం అభ్యర్థికి మెజార్టీ తగ్గడంతో మరో మారు ఈ సారి ఎన్నికల్లోనూ అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. ఈ సారి మాజీ మేయర్‌, అహ్మద్‌ నగర్‌ నివాసితుడు మాజీద్‌ హుస్సేన్‌కు టికెట్‌ కేటాయించి పోటీలో పెట్టారు.

బోగస్‌ ఓట్లపై ఫోకస్‌

ఈ నియోజకవర్గంలో భారీగా బోగస్‌ ఓట్లు ఉన్నాయని ఆధారాలతో సహా దశాబ్ద కాలంగా ఫిరోజ్‌ఖాన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. అది కాకుండా ఏకంగా కోర్టు మెట్లు ఎక్కారు. గడచిన ఐదు సంవత్సరాల్లో ఓటర్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేసే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టడడంతో వేల సంఖ్యలో బోగస్‌ ఓట్లు తొలగిపోయాయి. దీంతో ఈ సారి నాంపల్లిలో విజయం కష్టమని భావించిన ఎంఐఎం అభ్యర్థిని మార్చి కొత్త ముఖాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సైతం ఈ నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టారు. కాంగ్రెస్‌ తరఫున మరో మారు బరిలో నిలిచిన ఫిరోజ్‌ఖాన్‌ ఈ సారి విజయం సాధిస్తారని, మొదటి సారి ఎంఐఎంకు ఓటమి తప్పదని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి నాంపల్లి నియోజకవర్గంలో ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. మూడు సార్లుగా విజయం దరిదాపుల్లోకి వచ్చి వెళ్తున్న ఫిరోజ్‌ఖాన్‌పై అక్కడి ఓటర్లలో సానుభూతి ఉండడంతో ఈ సారైన ఆయన విజయం అందుకుంటారా? అని పార్టీ నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Updated Date - 2023-11-23T16:49:57+05:30 IST