Share News

ఇంకా 5 రోజులే

ABN , First Publish Date - 2023-11-24T16:10:14+05:30 IST

నగరంలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది.

ఇంకా 5 రోజులే

  • సర్వశక్తులూ ఒడ్డుతున్న నేతలు

  • ప్రచారానికి వానగండం

  • ఇలాగే ఉంటే ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందే

  • అభ్యర్థుల్లో పెరుగుతున్న ఆందోళన

  • ప్రారంభమైన డబ్బు పంపిణీ

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): నగరంలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ప్రచారానికి ఇక ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు పరుగులు పెడుతున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ మూడు నెలల ముందే అభ్యర్థుల జాబితా విడుదల చేయడంతో, వీరంతా ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలతో సిద్దమయ్యారు. కాంగ్రెస్‌, బీజేపీలు పలు దఫాలుగా అభ్యర్థుల జాబితా విడుదల చేశాయి. కొంతమందికి నామినేషన్‌ల దాఖ లుకు చివరి రోజు కూడా టికెట్లు ఇచ్చారు. మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులను చివరి నిమిషంలో మార్చారు. ఇలా చివరలో టికెట్‌ దక్కించుకున్న వారు ఇతరులతో పోల్చితే ప్రచారంలో కొంత వెనుకబడి ఉన్నారని, 50 శాతం నియోజకవర్గం కూడా తిరగలేకపోయారని తెలుస్తోంది. వీరితోపాటు కొత్తగా టికెట్‌ వచ్చిన వారికి ఎన్నికల ప్రచారంలో అనుభవం కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. మిగిలిన వారు దాదాపుగా పూర్తి చేసుకున్నారు. చాలా నియోజకవర్గాల్లో ప్రచార రఽథాలు వస్తున్నా నాయకులు పూర్తిస్థాయిలో నియోజకవర్గాన్ని చుట్టేయలేకపోతున్నారు. చాలామంది అభ్యర్థులు తమ కాలనీలో ప్రచారానికి రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలవకలేకపోవడం గెలుపు ఓటములపై ప్రభావం చూపుతుందని, అందువల్ల ప్రచారాన్ని ఈ నాలుగు రోజుల్లోమరింత ఉధృతం చేయాలని అభ్యర్థులు భావిస్తున్నారు.

ప్రారంభమైన డబ్బు పంపిణీ

ప్రచారంలో కీలకంగా మారిన డబ్బు పంపిణీకి అన్ని పార్టీలు తెరలేపాయి. కాలనీ సంఘాలు, కుల సంఘాలు, బస్తీ లీడర్ల ఆధ్వర్యంలో ఓటర్లకు డబ్బు అందిస్తున్నాయి. ఒక్కొక్కరికి రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక నాయకులు గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి డబ్బు పంపిణీ పూర్తి చేస్తున్నారు. అభ్యర్థులు కంటి మీద కునుకు లేకుండా రేపటి విజయానికి వ్యూహరచనలు చేస్తున్నారు. ఉదయం ఎన్నికల ప్రచారం, ఎదుటి పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం, రోడ్‌షోలు, సభలు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రచారానికి వాన దెబ్బ

ప్రచారానికి వర్షం గండి కొట్టేలా కనిపిస్తోంది. వర్షం కారణంగా ప్రచారం సాఫీగా సాగదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా నగరంలో గురువారం జరిగిన కేటీఆర్‌, రేవంత్‌ రెడ్డిల రోడ్‌షోలకు ప్రజలు తక్కువగా హాజరయ్యారు. వచ్చినవారు కూడా అర్థాంతరంగా వెళ్లిపోయారు. ఈనెల 25న కేసీఆర్‌, 27న మోదీ భారీ బహిరంగ సభలు, రాహుల్‌ గాంధీ రోడ్‌షోలు నిర్వహించనున్నారు. రెండుమూడు రోజులు వాతావరణం ఇలాగే ఉంటే ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-11-24T16:10:15+05:30 IST